వాయులీనమే ఆయన జీవన నాదం గాయక సార్వభౌమ పారుపల్లి ప్రియ శిష్యుడు కర్ణాటక సంగీత స్రష్ఠ బాలమురళి సహచరుడు సంగీత సరస్వతి గారాల తనయుడు అన్నవరపు రామస్వామి
శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణి అన్నారు. ఈ చరాచర సృష్టిలో సంగీతానికి సకల ప్రాణులు స్పందిస్తాయి. సంగీతానికి భాష, కులం, మతంతో నిమిత్తం లేదు. అది అనుభూతి పూర్వక మంత్రం. వీనుల విందు చేయడమే కాక మనసుకు ఆహ్లాదాన్నిచ్చేది సంగీతం. వాయులీనమే జీవన నాదంగా సంగీత ప్రపంచాన్ని శాసిస్తున్న నిత్య కృషీవలుడు అన్నవరపు రామస్వామి. గత 85 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో ఆయన సంగీత యాత్ర నిరాటంకంగా సాగుతోంది. నూరేళ్ల వయసులోనూ నిత్యనూతనంగా సంగీత సరస్వతికి పట్టాభిషేకం చేస్తున్న అన్నవరపు రామస్వామిపై ప్రత్యేక వ్యాసం.
విజయవాడ కల్చరల్: సంగీతమే శ్వాసగా జీవిస్తున్న అన్నవరపు రామస్వామి 1926వ సంవత్సరం మార్చి 23 వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా సోమవరంలో జన్మించారు. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, నాదస్వర విద్వాంసుడు పెద్దయ్య. అన్న గోపాలం వద్ద వయోలిన్‌లో సంగీత శిక్షణ ప్రారంభించి 11 సంవత్సరాల వయసులో బెజవాడలో వయోలిన్‌లో శిక్షణ తీసుకోవడానికి గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణ య్య పంతులు వద్ద చేరారు. ఆయన శిష్యరికంలో వయోలిన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. మంగళంపల్లి బాలమురళీ కృష్ణతో అప్పట్లో ప్రారంభమైన స్నేహం కడ వరకు సాగింది. ఇద్దరి సంగీత ప్రయాణంలో వేలాది కార్యక్రమాలను నిర్వహించారు. మంగళంపల్లి గాత్రానికి అన్నవరపు వయోలిన్ సహకారం పూవుకు తావి అబ్బినట్టు ఉండేది.
సంగీత దిగ్గజాలకు వాద్య సహకారం
వయోలిన్ ఒక వాద్యమేకాదు అన్నవరపు చేతిలో నాద బ్రహ్మగా మారింది. గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు( విద్యాభిక్షపెట్టిన గురువు), అరయ్యకుడి రామానుజ అయ్యంగార్, భీమ్‌సేన్ జోషి, టీఆర్ మహాలింగం, బాలమురళీ కృష్ణ లాంటి విద్వాంసులెందరికో వాద్యసహకారం అందించారు. గురు సంప్రదాయాన్ని పాటిస్తూ నగరంలో 75 సంవత్సరాలుగా సంగీత సద్గురువులు త్యాగరాజ స్వామి, సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి, పారుపల్లి రామకృష్ణయ్య పంతులు పేరిట సంగీత ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వంద సంవత్సరాల వయస్సులోనూ ఆయన ఇప్పటికీ కచేరీలు నిర్వహిస్తున్నారు.
ఆయన కీర్తికిరీటంలో కలికితురాయిలు
అన్నవరపు రామస్వామికి వందకుపైగా పురస్కారాలు లభించాయి. ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ (1983), సంగీత నాటక అకాడమీ పుర స్కారం(1996), భారత ప్రభుత్వం పద్మశ్రీ (2021), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పురస్కారం, మద్రాస్ మ్యూజిక్ అకాడమీ పురస్కారంతోపాటు అనేక పురస్కారాలు లభించాయి. ఆయన సుదీర్ఘ సంగీత ప్రయాణంలో 3 వేలకు పైగా కచేరీలు నిర్వహించారు.
ఆకాశవాణిలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా...
విజయవాడ ఆకాశవాణిలో స్టాఫ్ ఆర్టిస్ట్‌గా దశాబ్దాల పాటు సేవలను అందించారు. రేడియో ద్వారా శాసీ్త్రయ సంగీతాన్ని వేలాదిమందికి చేరువ చేశారు. వందన, శ్రీదుర్గ వంటి రాగాలకు రూపకల్పన చేశారు.
అన్నవరపు శిష్య పరంపర
నేడు ప్రముఖ సంగీత విద్వాంసులుగా పేరొందిన మోదుమూడి సుధాకర్, అంజనా సుధాకర్, బీవీ దుర్గాభవాని, అన్నవరపు రాఘవేంద్ర, డి.శ్రీనివాస్, కొమాండూరి వెంకట కృష్ణ, ఎం.సత్యనారాయణ, డాక్టర్ ప్రపంచం సీతారాంతో పాటు అనేక వందలమందికి విద్యాదానం చేశారు.
సంగీతంతో పాటు సంస్కారం ముఖ్యం
నేటి తరం యువ సంగీత కళాకారులు సంగీతంతో పాటు సంస్కారం కూడా నేర్చుకోవాలని తమ గురువు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు చెప్పేవారని అన్నవరపు రామస్వామి అన్నారు. సంగీతం భగవదత్తమైన వరమని, వేదంలా అధ్యయనం చేయాలని, చిత్త శుద్ధి, ఏకాగ్రత అవసరమన్నారు. సంగీతాన్ని భగవత్ సేవలా భావించాలన్నారు. విజయవాడలో తాను వారాలు చేసుకుని చదువుకున్నానని, గురువులు కుల మతాలకు అతీతంగా చూసుకునేవారన్నారు.


