2008లో వైఎస్సార్, 2023లో వైఎస్ జగన్ సాగునీరిచ్చారు ఆనాడు ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్‌లోనే... నేడు గతంలో కంటే ఎక్కువ నీటి నిల్వలు అయినా సాగునీరివ్వడం లేదు మూడు రోజుల నుంచి కృష్ణాజిల్లాలో పలు చోట్ల దీక్షలు స్పందించక పోతే అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకూ పాదయాత్ర
అవనిగడ్డ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008లో నైరుతీ రుతుపవనాలు మందగించడంతో పలుచోట్ల తీవ్ర వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు అక్కడ నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో లేకపోవడంతో నీటి నిల్వలు ప్రమాద స్థాయి కంటే దిగువకు పడిపోయాయి. పైగా అప్పటికింకా పులిచింతల, పట్టిసీమ ప్రాజెక్టులు కూడా లేవు. అయినప్పటికీ ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణాడెల్టాకు సాగునీటిని సరఫరా చేసి రైతులను ఆదుకున్నారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో 2023లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పుడు సైతం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డెల్టా రైతాంగానికి సాగునీరందించి పంటలను కాపాడారు. పులిచింతల నుంచి విడతల వారీగా నీళ్లు వదిలి, పట్టిసీమ నుంచి 3 వేల క్యూసెక్కులను సరఫరా చేసి వంతుల వారీ విధానం ద్వారా సాగునీరందించారు. గణాంకాల వారీగా చూస్తే శ్రీశైలంలో కాని, సాగర్‌లో కాని, ప్రకాశం బ్యారేజీ వద్ద కానీ 2008, 2023 సంవత్సరాల్లో కన్నా ఇప్పుడు నీటి నిల్వలు మెరుగ్గానే ఉన్నాయి. అయినా ప్రభుత్వం ఎందుకు సాగునీరివ్వదని డెల్టా రైతులు నిలదీస్తున్నారు.
పడిపోయిన సాగు
తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లోనూ 2008లో వైఎస్ రాజ శేఖరరెడ్డి డెల్టా పరిధిలో 13.07 లక్షల ఎకరాల ఆయ కట్టుకు సాగునీరందించగా, 2023లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో 13.08 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకూ 9.68 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగు జరగ్గా వాటికి కూడా సాగునీరందక పోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతాంగం
సాగునీటిని విడుదల చేయాలనే ప్రధాన డిమాండ్‌తో ఇప్పటికే అవనిగడ్డ, పెడన, మచిలీపట్నంలో ఆయా నియోజకవర్గాల వైఎస్సార్ సీపీ సమన్వయకర్తలు సింహాద్రి రమేష్‌బాబు, ఉప్పాల రాము, పేర్ని కిట్టు ఆధ్వర్యంలో మూడు రోజుల నుంచి రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. ఈనెల 10న బైక్ ర్యాలీ లు, ప్రదర్శనలు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. అప్పటికీ ప్రభుత్వం దిగిరాకుంటే సింహాద్రి రమేష్‌బాబు ఆధ్వర్యంలో అవనిగడ్డ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ మహా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతున్నారు.
2023 2026
శ్రీశైలం నీటిమట్టం 834 అడుగులు 834 అడుగులు
నాగార్జున సాగర్ నీటిమట్టం 505 అడుగులు 509 అడుగులు
ప్రకాశం బ్యారేజీ నీటిమట్టం 2.47 టీఎంసీలు 3.04 టీఎంసీలు


