మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం సర్వే | - | Sakshi
Sakshi News home page

మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం సర్వే

Aug 6 2026 8:14 AM | Updated on Aug 6 2026 8:14 AM

మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం సర్వే ‘హ్యాండ్‌బుక్‌’ అత్యంత కీలకపత్రం

గన్నవరం: విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్‌లో భాగంగా కారిడర్‌–1 కోసం మండలంలోని గన్నవరం, కేసరపల్లి గ్రామాల్లో బుధవారం సామాజిక ప్రభావ మదింపు కార్యక్రమం నిర్వహించారు. మెట్రో రైలు ప్రాజెక్ట్‌ కోసం ప్రభుత్వం నియమించిన అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇండియా(ఏఎస్‌సీఐ) ప్రతినిధులతో కలిసి రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌, వ్యవసాయ, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో ఈ సర్వే జరిపారు. తొలుత స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మెట్రోరైలు స్టేషన్‌ నిర్మాణం కోసం భూసేకరణ చేయనున్న స్థలాల్లో ఈ మదింపు చేపట్టారు. తహసీల్దార్‌ కె. వెంకటశివయ్య పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి మార్కింగ్‌ చేశారు. భూముల వివరాలు, అనుభవదారుల సమాచారం, ఈ ప్రాజెక్ట్‌ వల్ల ప్రజలపై కలిగే సామాజిక, ఆర్థిక ప్రభావాలను నమోదు చేశారు.

61.15 ఎకరాల సేకరణ..

తహసీల్దార్‌ వెంకట శివయ్య మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్‌ కోసం కేసరపల్లిలో ఏర్పాటు చేయనున్న మెట్రో డిపో కోసం 61.15 ఎకరాల భూములు సేకరించనున్నట్లు చెప్పారు. కేసరపల్లి, హెచ్‌సీఎల్‌, గన్నవరంలోని బుద్ధవరం బస్టాప్‌, ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద నిర్మించనున్న నాలుగు మెట్రో స్టేషన్ల కోసం మరో 1.35 ఎకరాలు భూసేకరణ చేయనున్నట్లు తెలిపారు. సామాజిక ప్రభావ మదింపు అనంతరం నివేదికతో పాటు ప్రణాళికను ఏఎస్‌సీఐ ప్రతినిధులు ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు చెప్పారు. ఏపీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ లక్ష్మీశ

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ అత్యంత ప్రామాణికమైన పత్రమని, గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగానికి సంబంధించిన సమగ్ర సమాచారంతోనే భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలు సమర్థంగా రూపొందించవచ్చని ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ పేర్కొన్నారు. బుధవారం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లోని ఏవీఎస్‌ రెడ్డి సమావేశ మందిరంలో జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ నమోదుపై జిల్లాలోని స్టాటిస్టికల్‌ అధికారులకు ఒకరోజు కార్యశాల నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ జిల్లా అభివృద్ధి ప్రణాళికలకు ప్రామాణిక ఆధార పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లోని ప్రతి ప్రాంతానికి సంబంధించిన సామాజిక, ఆర్థిక, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు తదితర రంగాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. జిల్లా జనాభా లెక్కల హ్యాండ్‌బుక్‌ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు ప్రతి ఒక్కరూ చురుకుగా భాగస్వాములు కావాలని కలెక్టర్‌ సూచించారు. జనగణన–2027 సన్నాహక కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని పేర్కొన్న కలెక్టర్‌, మండల స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి విడతల వారీగా సమగ్ర శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. శిక్షణ కార్యక్రమానికి అసిస్టెంట్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్‌ మేక స్వాతి మాస్టర్‌ ట్రైనర్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement