దుర్గమ్మకు విరాళాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శనివారం పలువురు భక్తులు విరాళాలను సమర్పించారు. దుర్గగుడి ఈఈ కోటేశ్వరరావు కుమార్తె రుద్రనవ్య తన తొలివేతనం నుంచి రూ.1,01,116 విరాళాన్ని అమ్మవారి బంగారు తాపడం పనులకు విరాళంగా అందజేశారు. హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఎం.గోపాల్ కుటుంబం అమ్మవారి బంగారు తాపడం పనులకు రూ.లక్ష విరాళాన్ని అందజేసింది. విజయవాడ దుర్గా ఆగ్రహారంకు చెందిన ఎం.నాగలక్ష్మీసాయిసత్య కుటుంబసభ్యులు అమ్మవారి నిత్యాన్నదానానికి రూ. 1,00,010 విరాళాన్ని ఆలయ అధికారులకు అందించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలను ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలతో సత్కరించారు.
పెనమలూరు: ఈనెల 5వతేదీ నుంచి బెంగళూరులోని ఎస్–వ్యాసా యూనివర్సిటీలో నిర్వహించే ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సీటీ పోటీలకు కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సీటీ యోగాసన మహిళల జట్టును ఎంపిక చేసినట్లు వర్సీటీ ఫిజికల్ డైరెక్టర్ పి.రఘు శనివారం తెలిపారు. ఈ జట్టులో వి.నీలవేణి, ఎ.చైతన్య, టి.యోగిత, ఐ.చందన, వి.గాయత్రి, డి.హాసిని ఉన్నారన్నారు. మహిళల యోగాసన జట్టును ఉపకులపతి డాక్టర్ పి.వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ. రత్నప్రసాద్, కోచ్.జి.రామలింగేశ్వరరావు అభినందించారు.
మోపిదేవి: శివ ముక్కోటి ఆరుద్ర నక్షత్రం సందర్బంగా మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, పెదకళ్లేపల్లి శ్రీదుర్గా నాగేశ్వరస్వామివార్లకు శనివారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు బుద్దు పవన్‌కుమార్‌శర్మ, ప్రసాద్‌శర్మ బ్రహ్మత్వంలో స్వామివార్లకు రుద్రాభిషేకం చేశారు. శ్రీదుర్గా నాగేశ్వరస్వామిని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు దర్శించుకున్నారు. అనంతరం స్వామివార్లను శేషవాహనంపై ఉంచి గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయ సూపరిటెండెంట్ అచ్యుత మధుసూదనరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): నూతన సంవత్సరం వేళ డిసెంబరు 31 రాత్రి చర్చికి వెళ్లిన మేనత్త ఇంట్లోకి చొరబడి నగలు చోరీ చేసిన ఓ యువకుడిని సీసీఎస్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించిన పోలీసులు, శనివారం అరెస్టు చేసి చోరీచేసిన రూ.23 లక్షల విలువైన 176 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు...గుంటూరుజిల్లా తాడేపల్లికి చెందిన గండికోట మనోజ్‌కుమార్ హెయిర్‌విగ్‌లు బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బులతో జల్సాలు చేసేవాడు. ఈ నేపథ్యంలో వాంబేకాలనీలో ఉంటున్న తన మేనత్త అరుణ గత డిసెంబరు 31న రాత్రి ఇంటికి తాళం వేసి చర్చికి వెళ్లగా, ఆమె ఇంట్లో నగలు, నగదు ఉంటాయని తెలిసిన మనోజ్‌కుమార్ వెనుక ఉన్న తలుపులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించాడు. బీరువా తాళం తీసి అందులోని బంగారు ఆభరణాలు తీసుకుని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన ఏడీసీపీ యం రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీసీఎస్ సీఐలు శ్రీనివాసరావులు సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. ఈక్రమంలో శనివారం వన్‌టౌన్ శివాలయం వీధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు సీసీఎస్ ఏడీసీపీ యం రాజారావు తెలిపారు. కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని సీపీ రాజశేఖరబాబు అభినందించారు.
దుర్గమ్మకు విరాళాలు
దుర్గమ్మకు విరాళాలు
దుర్గమ్మకు విరాళాలు


