నాడు మానవ మేధ.. నేడు కృత్రిమ మేధ
జ్ఞాన సముపార్జనలో పుస్తకానికి అద్వితీయ స్థానం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా సందడిగా పుస్తక ప్రియుల పాదయాత్ర
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): పుస్తకం.. నాడు మానవ మేధస్సును తీర్చిదిద్దితే, నేడు కృత్రిమ మేధస్సు రూపకల్పనలోనూ ప్రధాన భూమికను పోషిస్తుందని ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా అన్నారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా నిర్వహించిన పుస్తక ప్రియుల పాదయాత్ర మంగళవారం సందడిగా సాగింది. పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ కళాశాల వద్ద యాత్రను ఆర్పీ సిసోడియా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ పాదయాత్రకు నాయకత్వం వహించారు. ‘మాదక ద్రవ్యాలు వద్దు – పుస్తకాలే ముద్దు’ అనే ప్లకార్డులను విద్యార్థులు ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన ముగింపు సభలో ఆర్పీ సిసోడియా మాట్లాడుతూ వేగంగా మారుతున్న సాంకేతికత వల్ల పుస్తకాల తయారీ, ప్రచురణ, పంపిణీ, పఠనాల స్వరూప స్వభావాలే మారిపోతున్నాయని వివరించారు. ఈ నేపథ్యంలో పుస్తక ప్రియులంతా జ్ఞానాన్ని అందించడం, సమాజానికి వెలుగులు పంచడం అనే పుస్తకాల మౌలిక స్వభావం మారిపోకుండా చూడాలన్నారు. తరువాత తరాలకు పుస్తకాలను అందించాల్సిన బాధ్యతను స్వీకరించాలన్నారు.
భాషా సేవల్లో సవ్యసాచి మండలి..
పాదయాత్ర అనంతర సభను మాజీ విద్యాశాఖ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి సభగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలి జీవితంపై ‘దివిసీమ గాంధీ’ పుస్తకాన్ని సాహిత్య అకాడమీ పురస్కార విజేత యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, మండలి వెంకట కృష్ణారావు సిద్ధాంత నిబద్ధత కలిగిన నాయకులు అని వివరించారు.
నున్న(విజయవాడరూరల్): నున్న గ్రామంలో బుధవారం మామిడి రైతులకు మామిడి తోటల సంరక్షణపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని ఎన్టీఆర్ జిల్లా ఉద్యాన శాఖాధికారి పి.బాలాజీ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నూజివీడు మామిడి పరిశోధన సంస్థ నుంచి శాస్త్రవేత్తలు డాక్టర్ కనకమహాలక్ష్మి, డాక్టర షాలిరాజు హాజరవుతున్నారని పేర్కొన్నారు. మామిడి రైతులు పాల్గొనాలని కోరారు.
నాడు మానవ మేధ.. నేడు కృత్రిమ మేధ


