సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి
మచిలీపట్నంఅర్బన్: ప్రభుత్వ ఆరోగ్య సంస్థలైన జీజీహెచ్, సీహెచ్‌సీలలో సిజేరియన్ డెలివరీల రేటును తగ్గించే దిశగా సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ పి. యుగంధర్ సూచించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం చైల్డ్ డెత్ రివ్యూ (సీడీఆర్), మాతృ మరణాలపై (ఎండీఎస్‌ఆర్) సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాధారణ ప్రసవాలు ప్రోత్సహిస్తూనే ఎపిడ్యూరల్ అనస్థీషియాతో నొప్పిలేని ప్రసవాలను విస్తృతంగా అమలు చేయాలని తెలిపారు. ఆర్సీహెచ్ 2.0 అమలు విధానం, హెచ్‌పీఆర్ ఐడీ మ్యాపింగ్, డేటా కచ్చితత్వం, సేవల సమగ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే పెండింగ్‌లో ఉన్న జేఎస్‌వై చెల్లింపుల అంశాన్ని సమీక్షించి, వాటిని త్వరితగతిన పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్, అనస్థీషియా విభాగాధిపతి, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి, గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్‌తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


