లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు

Mar 19 2026 10:25 AM | Updated on Mar 19 2026 10:25 AM

లారీ ఢీకొని ముగ్గురు చిన్నారులకు గాయాలు బైక్‌ను ఢీకొట్టిన కారు.. ముగ్గురికి గాయాలు

కోనేరుసెంటర్‌: లారీ ఢీకొనటంతో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో బుధవారం జరిగింది. విషయం తెలుసుకున్న మచిలీపట్నం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. బుధవారం మధ్యాహ్నం సుమారు ఒంటి గంట సమయంలో పరాసుపేటలోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ స్కూలు వదలగా ఓ మహిళ తన పిల్లలను మోపెడ్‌పై ఎక్కించుకుని ఇంటికి వెళుతోంది. సరిగ్గా పరాసుపేట సెంటర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకున్న సమయంలో కరగ్రహారం నుంచి పరాసుపేటకు చేరుకున్న లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యంగా వాహనాన్ని నడుపుతూ చిన్నారులు వెళుతున్న మోపెడ్‌ను ఢీకొన్నాడు. తల్లి పిల్లలు రోడ్డుపై పడిపోగా రెండు అడుగుల దూరం వరకు మోపెడ్‌ను లారీ దూసుకుంటూ ఈడ్చుకు వెళ్లింది. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన తోటి వాహనదారులు లారీడ్రైవర్‌ నిర్లక్ష్యాన్ని మందలిస్తూ గట్టిగా కేకలు పెట్టారు. దీంతో అప్రమత్తమైన డ్రైవర్‌ లారీని రివర్స్‌ చేయటంతో ఘోర ప్రమాదం తప్పింది. లేదంటే తల్లితో పాటు ముగ్గురు చిన్నారులు లారీ చక్రాల కింద పడి నలిగిపోయే పరిస్థితి ఏర్పడేది. చిన్నారులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

పరారీలో డ్రైవర్‌!

గాయాలపాలైన పిల్లలను చికిత్స నిమిత్తం స్థానికులు హుటాహుటిన ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇదే అదునుగా భావించిన లారీడ్రైవర్‌ వాహనాన్ని పక్కకు పెడుతున్నట్లు నటించి అక్కడి నుంచి ఉడాయించాడు. జరిగిన సంఘటనపై సమాచారం అందుకున్న మచిలీపట్నం పోలీసులు, బందరు ట్రాఫిక్‌ పోలీసులు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకున్నారు. సీసీ ఫుటేజీలను పరిశీలించి లారీ ఘంటశాలకు చెందినదిగా గుర్తించిన పోలీసులు లారీ డ్రైవర్‌తో పాటు వాహన యజమానిని స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్నట్లు సమాచారం.

పెడన: పెడన– బంటుమిల్లి 216 జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కట్లపల్లి సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో పెడన పట్టణంలోని శ్రీకృష్ణతులసీ థియేటర్‌ సమీపంలో నివాసం ఉండే పెయింటర్‌ యాళ్ల సాయి(24) తమ సమీప బంధువుల పిల్లలు గూట్ల మేఘశ్రీ(5), పుట్టి వైష్ణవి(12)లతో కలిసి సాయి తల్లిదండ్రులుంటున్న శింగరాయపాలెంకు సుమారు రాత్రి ఏడున్నర గంటల సమయంలో బయల్దేరాడు. ఈక్రమంలో నరసాపురం నుంచి వస్తున్న కారు ఎదురుగా వచ్చి వీరి బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సాయి, మేఘశ్రీ, వైష్ణవి తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement