డబ్బులు ఊరికే రావు!
రోజుకో రకం.. సైబర్ నేరం..
విస్తృత అవగాహన..
సిమ్ లోకల్.. నేరగాళ్లు నాన్‌లోకల్..
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో ఉంటూ లోకల్‌గా ఏజెంట్లను నియమించుకుని సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. ఒక నేరానికి.. మరో నేరానికి పొంతన లేకుండా కొత్త కొత్త ఎత్తులు వేస్తున్నారు. వాటిని నివారించడం పోలీసులకు సైతం పెనుసవాల్‌గా మారుతోంది. విదేశాల్లో ఉంటారు.. లోకల్‌ఫోన్ నంబర్‌తో మాట్లాడతారు. అకౌంట్స్ కూడా లోకల్ బ్యాంక్‌లవే చెబుతూ నమ్మిస్తుంటారు. ఈ తరుణంలో ప్రజలు అవగాహనతో మెలగడం.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌లు వచ్చినప్పుడు భయపడకుండా పోలీసులకు సమాచారం ఇవ్వడమే పరిష్కార మార్గంగా పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా నేరం జరిగిన తర్వాత వెంటనే సైబర్ కై మ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.
డబ్బు ఆశ చూపి.. కుచ్చుటోపీ..
విదేశాల్లో ఉన్న సైబర్ నేరగాళ్లకు లోకల్‌గా కొందరు ఏజెంట్లు పనిచేస్తుంటారు. వారి ద్వారా సామాన్యులకు డబ్బు ఆశ చూపి కరెంట్ అకౌంట్స్ ఓపెన్ చేయిస్తారు. అనంతరం ఆ అకౌంట్స్ వివరాలు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఐడీ, పాస్‌వర్డ్ వివరాలన్నీ సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కుతాయి. దీంతో వాళ్లు నేరాలకు పాల్పడినప్పుడు, ఆ నగదును స్థానికంగా ఉన్న ఈ అకౌంట్స్‌లో ఒకదాని తర్వాత మరొకటి వేర్వేరు ప్రాంతాలకు చెందిన ఐదారు అకౌంట్స్‌కు మళ్లిస్తుంటారు. ఇటీవల లబ్బీపేటకు చెందిన ఒక యువకుడు రూ.10 వేలకు ఆశపడి అకౌంట్స్ వివరాలు ఇస్తే రెండు రోజుల్లో రూ.2 కోట్ల మేర లావాదేవీలు చేయడంతో అతను సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భవానీ పురానికి చెందిన సైబర్ నేరగాళ్లకు సహకరించే మణికంఠ అనే నిందితుడి ద్వారా లబ్బీపేటకు చెందిన దంపతులు ఆ యువకుడికి రూ.10వేలు ఇచ్చి అకౌంట్ వివరాలు తీసుకున్నట్లు గుర్తించారు. దాదాపు సైబర్ నేరగాళ్లు నగదు లావాదేవీలు చేసే అకౌంట్లు అన్నీ ఇలానే ఉంటున్నాయి.
రికవరీలు సవాలే..
సైబర్ క్రైమ్ కేసుల్లో రికవరీలు సవాల్‌గానే ఉంటోంది. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు అందినప్పుడు మాత్రమే రికవరీ వేగంగా చేయగలుగుతున్నారు. బాధితుడి అకౌంట్ నుంచి డబ్బులు ఎన్ని అకౌంట్లకు వెళ్లాయో తెలుసుకుని, ఏదైనా అకౌంట్లలో నగదు ఉన్నట్లు గుర్తిస్తే ఆ బ్యాంకర్లతో మాట్లాడి సీజ్ చేయిస్తున్నారు. అలా ఇటీవల కొందరికి ఊరట కలిగింది. అయితే నేరాల్లో బాధితులు కోల్పోయిన మొత్తాలతో పోలిస్తే రికవరీ నామమాత్రంగానే ఉంటోంది. చిన్న నేరాలు కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి.
కరెంట్ ఖాతాల వెనుక సైబర్ కేటుగాళ్లు!
డబ్బు ఆశ చూపి సామాన్యులతో
కరెంట్ ఖాతాలు
అదే తరహాలోనే ఫోన్ సిమ్ కార్డులు కూడా..
విదేశాల్లో ఉంటూ లోకల్ సిమ్‌లను వినియోగిస్తున్న నేరగాళ్లు
పోలీసులకు సైతం పెనుసవాల్‌గా మారుతున్న సైబరాసురులు
సైబర్ నేరాలను నిరోధించేందుకు ప్రజలకు విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నట్లు సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. సైబర్ నేరాల నియంత్రణలో కీలకంగా ఉండే బ్యాంకు అధికారులు, సిబ్బందికి సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు జరిగాయి. ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలి. నేరం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయాలి. సీబీఐ, ఈడీ అధికారులంటూ ఫోన్ చేస్తే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలని అంటున్నారు.
సైబర్ నేరగాళ్లు ఏ రూపంలో వస్తారో తెలియడం లేదు. ప్రతి నేరం కొత్తగానే ఉంటోంది. ఒకరిని సీబీఐ, ఈడీ అధికారుల పేరుతో బెదిరిస్తారు.. మరొకరిని ఉమెన్ ట్రాఫికింగ్ కేసు నమోదైందని డిజిటల్ అరెస్టు అంటూ ఆందోళనకు గురి చేస్తారు.. ఇంకొకరిని పొలిటికల్ నేత పేరుతో ఫోన్ చేసి పదవులు ఇప్పిస్తాం.. బిల్లులు ఇప్పిస్తామంటూ ఆశల వల వేసి నగదును దోచేస్తారు. ఓఎల్‌ఎక్స్ పేరుతో కొందరు.. వాట్సాప్‌కు ఏపీకే ఫైల్స్‌ను పంపించడం ద్వారా వారి ఫోన్‌లను హ్యాక్ చేసి మరికొందరు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు కాజేస్తుంటారు. ఇలా సరికొత్త ఎత్తులతో సైబర్ నేరగాళ్లు పోలీసులకే సవాల్ విసురుతున్నారు.
విద్యుత్ శాఖలో పనిచేసే ఒక ఏడీఓతో పర్సనల్ లోన్ పెట్టించి మరీ దోచేసిన ఘటన ఇటీవల వెలుగుచూసింది. అధిక వడ్డీలు ఆశ చూపి మొగల్రాజపురానికి చెందిన ఒకరి వద్ద రూ.25 లక్షలు దోపిడీ చేశారు.
సైబర్ నేరగాళ్లు మయన్మార్, వియత్నం, కంబోడియా, దావోస్, థాయ్‌లాండ్, మలేషియా వంటి దేశాల్లో మకాం వేస్తుంటారు. కానీ వాళ్లు వాడే సిమ్‌లు అన్నీ లోకల్ నంబర్లు గానే ఉంటాయి. లోకల్‌గా ఉన్న ఏజెంట్ల ద్వారా పెద్ద ఎత్తున సిమ్స్‌ను సమీకరించి వాటిని నేరాలకు పాల్పడే సమయంలో మాట్లాడేందుకు వినియోగిస్తున్నారు. సిమ్‌బాక్స్ ద్వారా అంతర్జాతీయ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చేందుకు ఈ సిమ్‌లను ఉపయోగిస్తుంటారు. వాళ్లు ఫోన్ చేసినప్పుడు లోకల్ నంబర్లతో మాట్లాడుతుండటంతో బాధితులు నమ్మేస్తున్నారు. ఇలా సైబర్ నేరగాళ్లు యథేచ్ఛగా నేరాలకు పాల్పడుతున్నారు.


