నిర్దిష్ట కార్యాచరణతో నూరుశాతం ఫలితాలు
కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నంఅర్బన్: పదోతరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించడం సాధ్యమేనని, అందుకు నిర్దిష్ట కార్యాచరణతో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. పదో తరగతి పరీక్షల ఫలితాల మెరుగుదల లక్ష్యంగా శనివారం కృష్ణా యూనివర్సిటీలోని అల్లూరి సీతారామరాజు ఆడిటోరియంలో 100రోజుల కార్యాచరణ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎగ్జిస్టెన్స్ టు ఎక్సలెన్స్–రైజింగ్ స్టార్స్ అండ్ షైనింగ్ స్టార్స్ పేరుతో రూపొందించిన సవరించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ వర్క్‌షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించేందుకు అధికారులు, ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. లక్ష్య సాధన కోసం ప్రతి పాఠశాలకు ఒక జిల్లా అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించినట్లు వివరించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను సంబంధిత ఉపాధ్యాయుల సహకారంతో గుర్తించి, వారిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రత్యేకాధికారులను ఆదేశించారు. విద్యార్థులు కుటుంబపరిస్థితులు, మానసిక ఒత్తిడితో బాధపడుతుంటే వారి తల్లిదండ్రులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కూన రాంజీ, రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.ఉష, జిల్లా విద్యాశాఖాధికారి యువి.సుబ్బారావు, ఆయా శాఖల జిల్లా అధికారులు, మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.


