భూవివాదాలు లేకుండా పాస్ పుస్తకాలు : జేసీ
జుఝవరం(పామర్రు): గ్రామాల్లో ప్రజల మధ్య భూవివాదాలు, రికార్డుల్లో తప్పులకు అవకాశం లేకుండా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ తెలిపారు. పామర్రు మండలం జుఝవరం గ్రామ సచివాలయం వద్ద శనివారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా జేసీ నవీన్ మాట్లాడుతూ భూమియే ప్రాణంగా బ్రతికే రైతులకు భూసమస్యలు లేకుండా చేయడమే లక్ష్యమన్నారు.నిర్దిష్ట సమయంలోగా పాస్ పుస్తకాల పంపిణీ పూర్తిచేయాలని, అందుకు మండల తహసీల్దార్ ప్రత్యేక చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం ఆయన పలువురు రైతులకు పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ జన్ను శోభన్‌బాబు ,మండల తహసీల్దార్ జీ రవికాంత్, గ్రామ సర్పంచ్ పుట్టి పున్నమ్మ, ఆర్‌ఐ రాము, వీఆర్వోలు, గ్రామస్తులు పాల్గొన్నారు.


