వృద్ధురాలిపై యువకుడి హత్యాయత్నం
కంకిపాడు: ఓ యువకుడు వృద్ధురాలిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కంకిపాడులో కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు...పట్టణంలోని మురళీ ఆసుపత్రిరోడ్డులో ఉంటున్న వక్కలగడ్డ వకుళాదేవి(60) ఇంట్లోకి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కట్టెపోగు కృపాకర్ అలియాస్ పెట్రోల్ అనేవ్యక్తి ప్రవేశించాడు. వంట గదిలోని కత్తెర తీసుకుని వకుళాదేవిపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వృద్ధురాలి శరీరం, తల, ఛాతీ తదితరప్రాంతాల్లో గాయాలయ్యాయి. ఈక్రమంలో ఆమె పెద్దగా కేకలు వేయడంతో యువకుడు కృపాకర్ అక్కడ్నుంచి పారిపోయేందుకు యత్నించగా, ఇరుగుపొరుగు అప్రమత్తమై అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అప్పటికే కృపాకర్ గంజాయి మత్తులో ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. గాయపడిన వకుళాదేవిని చికిత్సనిమిత్తం స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని వెంటబెట్టుకుని సీఐ జె.మురళీకృష్ణ, ఎస్‌ఐ డీ.సందీప్, అదనపు ఎస్‌ఐ తాతాచార్యులు శనివారం ఘటనాస్థలాన్ని సందర్శించారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సందీప్ తెలిపారు.
వృద్ధురాలిపై యువకుడి హత్యాయత్నం


