నూతన సాంకేతికతతో పట్టాదారు పాసు పుస్తకాలు
పెండ్యాల(కంచికచర్ల): ఆధునిక సాంకేతికత అనుసంధానంతో భూమి యాజమాన్య హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను రాజముద్రతో ప్రభుత్వం అందిస్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు. మండలం పరిధిలోని పెండ్యాలలో శుక్రవారం జరిగిన రెవెన్యూ గ్రామ సభలో కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ పాల్గొన్నారు. భూయజమానులకు హక్కు పత్రం, పట్టాదారు పుస్తకాలను ఈ–కేవైసీతో అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ రికార్డుల డిజిటలైజేషన్, సాంకేతిక ఆధునికీకరణ డేటా ద్వారా భూమి వివాదాలకు చెక్ పెట్టడంతో పాటు వేగవంతమైన సేవలు రైతులకు అందుతాయన్నారు. రోవర్లు వంటి ఆధునిక సాంకేతిక పరికరాలతో సర్వే జరగ్గా, శాటిలైట్ టెక్నాలజీ, జియో కోడ్స్ అనుసంధానంతో పారదర్శకంగా పట్టాదారు పుస్తకాలు తయారు చేశామన్నారు. వరదలు వంటి విపత్తులు వచ్చినా భూములు, మన హద్దులు భద్రంగా ఉంటాయని వివరించారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన పెండ్యాలను మరింత ప్రగతి దిశగా నడిపించేందుకు సమష్టిగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా సర్వే అధికారి వై.మోహన్‌రావు, నందిగామ ఆర్డీఓ కె.బాలకృష్ణ, సర్పంచ్ షబ్బీర్ పాషా, తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీవో వెంకటేశ్వరరావు, రైతులు పాల్గొన్నారు.


