అనుమానాస్పద స్థితిలో పసికందు మృతి
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
వెంకటాపురం(మోపిదేవి): మండలంలోని వెంకటాపురం గ్రామంలో 45 రోజుల పసికందు అనుమానాస్పదంగా నీటిగుంటలో శవమై కనిపించింది. మండలంలో సంచలనం కలిగించిన ఈ ఘటన గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఎస్‌ఐ గౌతమ్‌కుమార్ తెలిపిన వివరాల మేరకు రావి ప్రభుకుమార్, సాయి చైతన్య దంపతులకు 40 రోజుల క్రితం కుమార్తె జన్మించింది. ప్రభుకుమార్ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో ఉంటున్నారు. భార్య సాయి చైతన్య బిడ్డతో అత్తమామల ఇంటివద్ద వెంకటాపురంలో ఉంది. సాయంత్రం 7 గంటల సమయంలో చంటిపిల్ల కనిపించడం లేదని అత్త, కోడలు ఆందోళన చెందుతూ వెతికారు. చుట్టుపక్కల వారితో గాలించగా ఇంటి పక్కనే ఉన్న నీటి గుంటలో శవమై తేలడాన్ని గమనించారు. శుక్రవారం ఉదయం సాయి చైతన్య సోదరుడు వీరమాచనేని వితీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ గౌతమ్ కుమార్ తెలిపారు.


