బండారు అక్షరాలు సమాజంపై సంధించిన శస్త్రాలు
అవనిగడ్డ శాసన సభ్యుడు మండలి బుద్ధప్రసాద్
విజయవాడ కల్చరల్: సీనియర్ జర్నలిస్ట్, కాలమిస్ట్ బండారు రాధాకృష్ణ అక్షరాలు వర్తమాన సమాజ తీరుతెన్నులపై సంధించిన అస్త్రశస్త్రాలు అని అవనిగడ్డ శాసన సభ్యుడు, ప్రపంచ తెలుగు రచయితల సంఘం గౌరవ అధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్టాజిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో బందరురోడ్డులోని సర్వోత్తమ భవన్‌లో శుక్రవారం బండారు రాధాకృష్ణ రచించిన వ్యాస సంపుటి సత్యాన్వేషణ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత్రికేయునికి ప్రశ్నించే గుణం ఉండాలన్నారు. రాధాకృష్ణ సుదీర్ఘకాలం పాత్రికేయునిగా సమాజాన్ని పరిశీలించేవారని గుర్తుచేశారు. నేటి ప్రజాస్వామ్యం– ధనస్వామ్యంగా మారిపోయిందని, రాజకీయాలలో జవాబుదారీతనం లోపించిందని, అవినీతి రాజ్యమేలుతోందని విమర్శించారు. విశ్రాంత అధ్యాపకుడు డాక్టర్ గుమ్మా సాంబశివరావు సత్యాన్వేషణ గ్రంథాన్ని సమీక్షించారు. 87 ఏళ్ల వయసులో కూడా రాధాకృష్ణ వ్యాసాలలో బిగువ తగ్గలేదన్నారు. ప్రతి వ్యాసం ఆలోచనాత్మకంగా ఉందన్నారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు సభకు అధ్యక్షత వహించారు. రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవీ పూర్ణచందు, ఆకాశవాణి ,దూరదర్శన్ విశ్రాంత సంచాలకుడు గుత్తికొండ కొండలరావు, మల్లెతీగ సాహిత్య పత్రిక సంపాదకుడు కలిమిశ్రీ , సీనియర్ పాత్రికేయుడు టీవీ సుబ్బయ్య, సర్వోత్తమ గ్రంథాలయం నిర్వాహకురాలు రావి శారద, సాహితీవేత్త రాళ్ళపల్లి భాస్కరరావు పాల్గొన్నారు. అనంతరం రచయిత రాధాకృష్ణను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, పలువురు ఘనంగా సత్కరించారు. తొలుత వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన కవులు స్వీయ కవితా గానం చేశారు. నాదెళ్ళ ఉమాదేవి వీణా వాదన శ్రావ్యంగా సాగింది.


