ఎట్టకేలకు బైపాస్ రోడ్డు పనులు ప్రారంభం
గన్నవరం:మండలంలోని చిన్నఆవుటపల్లి వద్ద ఎన్‌హెచ్ 16 చైన్నె–కోల్‌కత్తా జాతీయ రహదారికి కొత్తగా నిర్మించిన బైపాస్ రోడ్డు అనుసంధాన పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. బైపాస్ రహదారి నిర్మాణ పనులు దాదాపుగా పూర్తికావస్తుండడంతో వాహనాల రాకపోకలకు వీలుగా అనుసంధాన ప్రక్రియను చేపట్టారు. చిన్నఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 30 కిలోమీటర్ల పొడవునా ఆరు వరుసల బైపాస్ రోడ్డు నిర్మాణం చేశారు. పిన్నమనేని సిద్ధార్ధ వైద్య కళాశాల సమీపంలో బైపాస్ రోడ్డు ప్రారంభమయ్యే జీరో పాయింట్ వద్ద మాత్రం గత రెండేళ్లుగా పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల ప్రస్తుతం ఉన్న జాతీయ రహదారి నుంచి బైపాస్ రోడ్డులోకి వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాల కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగా ఇంజినీరింగ్ సంస్థ బైపాస్ అనుసంధాన పనులను పునఃప్రారంభించింది. ఈ ప్రక్రియ పూర్తయితే వాహనాలు విజయవాడ నగరంలోకి రాకుండానే బైపాస్ మీదుగా రాకపోకలు సాగించనున్నాయి. దీనివల్ల ట్రాఫిక్ సమస్యలు కొంత వరకు తీరనున్నాయి.


