మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా!
కోనేరుసెంటర్: ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాకాలో మద్యం మాఫియా రెచ్చిపోతుంది. పగలు, రాత్రి తేడా లేకుండా మద్యం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటుంది. నిబంధనలు తుంగలో తొక్కి అక్రమార్జనలో తాండవం ఆడుతుంది. మద్యం వ్యాపారులు ఇచ్చే మత్తులో అధికారులు కూరుకుపోయారనే ఆరోపణలొస్తున్నాయి. మచిలీపట్నంలో కొత్త లైసెన్స్‌లు పొందిన వ్యాపారులతో పాటు గతంలో మద్యం వ్యాపారంలో అపారమైన అనుభవం కలిగిన వ్యాపారులు (కూటమి నాయకులు) ఎకై ్సజ్ నిబంధనలకు పాతర వేసి మద్యం ప్రియుల నుంచి కాసులు కాజేస్తున్నారు. ఇష్టారాజ్యంగా అమ్మకాలు జరుపుతూ ఆదాయాన్ని గతంలో కంటే పది రెట్లుకుపైగా పెంచుకుంటున్నారు. బందరులో ఏడు రెస్టారెంట్ అండ్ బార్‌లు ఉన్నాయి. మండలంలోని తాళ్ళపాలెం, చిన్నాపురం, సుల్తానగరంతో పాటు నగరంలో మరో ఏడు వైన్ షాపులు ఉన్నాయి. వైన్ షాపుల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అమ్మకాలు జరపాలి. రెస్టారెంట్ అండ్ బార్‌లలో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలి. రెస్టారెంట్‌లలో ఫుడ్ నిమిత్తం మరో గంట వరకు మందుబాబులకు వెసులుబాటు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఉంది.
సొంత నియోజకవర్గంలోనే....
జిల్లాలో పరిస్థితి ఎలా ఉన్నా సాక్షాత్తూ అబ్కారీశాఖ మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గంలో మాత్రం మద్యం పగలు, రాత్రి పరవళ్లు తొక్కుతుంది. అదేమంటే మేమింతే అడ్డుకుంటే అంతే అంటూ కూటమి నాయకులు (మద్యం వ్యాపారులు) సంబంధిత అధికారులపై అధికారం చెలాయిస్తున్నారు. సొంత నియోజకవర్గంలోనే మద్యం వ్యాపారాన్ని నియత్రించలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకేమి కట్టడి చేయగలుగుతారంటూ జనం ప్రశ్నిస్తున్నారు.
అధిక ధరలు వసూలు....
బందరులో క్వార్టర్ మద్యంకు రూ. 40 నుంచి రూ. 50 వరకు వసూలు చేస్తూ పేదల సొమ్మును మింగేస్తున్నారు. కొన్ని వైన్‌షాపుల్లో వ్యాపారులు తమ దుకాణాలకు కూతవేటు దూరంలోని బడ్డీకొట్టుల్లో బాటిళ్ళు పెట్టి క్వార్టర్‌కు రూ. 20 చొప్పున అధిక ధరలకు అమ్ముకుంటున్నట్లు తెలిసింది. నగరంలోని లక్ష్మీటాకీస్‌సెంటర్, రాజుపేట ప్రాంతాల్లో కొనసాగుతున్న బార్‌లలో అయితే రాత్రి తెల్లార్లు తాగేందుకు ఓపిక ఉండాలే గానీ బార్‌లో సిబ్బంది మందుబాబులకు బాటిళ్ళను రోడ్లపైకి అందిస్తున్నట్లు సమాచారం. అలాగే రేవతిసెంటర్‌కు సమీపంలో ఉన్న బార్‌లో 24 గంటలూ విచ్చలవిడిగా అమ్మకాలు జరుపుతూ గల్లాలు నింపుకుంటున్నారు. వీటితో పాటు రాజాగారి సెంటర్‌లో ఉన్న మరో బార్, బస్టాండ్‌సెంటర్‌లోని బార్ పరిస్థితి అదే దారిలో ఉన్నాయి. రూరల్ ప్రాంతంలోని ఓ వైన్‌షాపు యజమాని బడ్డీకొట్టులో బాటిళ్లు పెట్టి అమ్మిస్తున్నారు.
24 గంటలూ బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు
వైన్ షాపులదీ అదే దారి
బడ్డీ కొట్లలోనూ మద్యం అమ్మకాలు
పట్టించుకోని ఎకై ్సజ్ శాఖాధికారులు


