టెన్త్ ఫలితాల్లో టాప్ ఫైవ్‌లో ఉండాలి
– డీఈఓ యూవీ సుబ్బారావు
మచిలీపట్నంఅర్బన్: పదో తరగతి ఫలితాల్లో జిల్లాను రాష్ట్ర స్థాయిలో టాప్ ఫైవ్‌లో నిలిపేందుకు ఉపాధ్యాయులు సమష్టిగా కృషి చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి యువీ సుబ్బారావు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) రాష్ట్ర శాఖ రూపొందించిన స్టడీ మెటీరియల్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విద్యార్థుల అభ్యాస స్థాయిని మెరుగుపరిచేలా రూపొందించిన ఈ స్టడీ మెటీరియల్ పదవ తరగతి ఫలితాలపై సానుకూల ప్రభావం చూపుతుందని చెప్పారు. ఉపాధ్యాయులు మెటీరియల్‌ను సమర్థంగా వినియోగించి విద్యార్థులను ఉత్తమ ఫలితాల దిశగా నడిపించాలని సూచించారు. అనంతరం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. ఇమ్మానియేల్, యువి. కృష్ణమూర్తి మాట్లాడుతూ గత ఏడాది తొలిసారిగా రూపొందించిన స్టడీ మెటీరియల్ పదవ తరగతి ఫలితాల్లో విద్యార్థులకు ఉపయోగంగా నిలిచిందన్నారు. అదే స్ఫూర్తితో ఈ ఏడాది కూడా నాణ్యమైన స్టడీ మెటీరియల్‌ను రూపొందించామని తెలిపారు. జిల్లాలోని ఉపాధ్యాయులు, విద్యార్థులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి డి. చంద్రశేఖర్, సీనియర్ నాయకులు ఎంవిఎస్‌ఎన్. ప్రసాద్, జిల్లా ఆర్థిక కార్యదర్శి కె. మాధవరావు, అర్బన్ అధ్యక్షులు ఎస్. కిరణ్ బాబు, కార్యదర్శి ఎం. వీర బాబు, సతీష్ బాబు, గంగ రాజు, పలు మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


