డాక్టర్ మృదులకు గోల్డ్ మెడల్
లబ్బీపేట(విజయవాడతూర్పు):ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కాలేజ్ ఆర్థోపెడిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మృదుల బుద్ధానకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌరవం లభించినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండరావు తెలిపారు. గువాహటీలో జరిగిన జాతీయ స్థాయి ఆర్ధోపెడిక్ సదస్సు 2025కు డాక్టర్ మృదుల సమర్పించిన పరిశోధనకు ప్రతిష్టాత్మక డాక్టర్ డి.పీ. బక్సీ గోల్డ్ మెడల్ అందుకున్నట్లు చెప్పారు. పునరావృతమయ్యే భుజం జారి పోవడం సమస్యపై, ముఖ్యంగా లాటార్జే శస్త్రచికిత్స విధానంపై డాక్టర్ మృదుల చేసిన శాసీ్త్రయ పరిశోధనకు ఈ గౌరవం లభించిందన్నారు. ఈ అధ్యయనంలో భుజం స్థిరత్వం మెరుగుదల, శస్త్రచికిత్స అనంతర ఫలితాలు, దీర్ఘకాలిక విజయ శాతం గురించి సమగ్ర విశ్లేషణను ఆమె వివరించినట్లు పేర్కొన్నారు. యువత, క్రీడాకారుల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యకు లాటార్జే విధానం ఒక విశ్వసనీయ చికిత్సా మార్గమని ఆమె పరిశోధన ద్వారా నిరూపించినట్లు ప్రశంసించారు. ఈ సందర్భంగా డాక్టర్ మృదులను గురువారం ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్ధోపెడిక్ ప్రొఫెసర్లు డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాసరావు, డాక్టర్ శ్యామ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


