5 నుంచి త్యాగరాజస్వామి సంగీతోత్సవాలు
విజయవాడ కల్చరల్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో శ్రీ సంగీత సన్మండలి ఆధ్వర్యంలో ఈ నెల ఐదో తేదీ నుంచి 11వ తేదీ వరకు సద్గురు త్యాగరాజ స్వామి ఆరాధాన సంగీతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సన్మండలి అధ్యక్షుడు మోదుమూడి సుధాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దుర్గాపురంలోని జీవీఆర్ సంగీత కళాశాలలో నిర్వహించే మహోత్సవాల్లో సంగీత ప్రముఖులతోపాటు యువ సంగీత విద్వాంసులు పాల్గొంటారని చెప్పారు. 5 వ తేది సాయంత్రం మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు ఉత్సవాలను ప్రారంభిస్తారన్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటలకు త్యాగరాజ స్వామి రచించిన కీర్తనలు పలువురు విద్వాంసులు ఆలపిస్తారన్నారు. 7వ తేదీ బుధవారం ఉదయం త్యాగరాజ స్వామి, ఆంజనేయ విగ్రహాలతో నగర సంకీర్తన, 11వ తేదీ సద్గురు త్యాగరాజ స్వామి రచించిన పంచరత్న కృతుల గోష్టిగానం ఉంటుందని పేర్కొన్నారు. 200 మందికి పైగా విద్వాంసులు పాల్గొంటారని వెల్లడించారు. విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేస్తుందన్నారు.


