గ్రేటర్ విలీనంతో భవిష్యత్తు ప్రశ్నార్థకం
గ్రేటర్‌ను వ్యతిరేకిస్తున్న గ్రామ పంచాయతీలు ఆందోళనలో ప్రజానీకం
పెనమలూరు: గ్రేటర్ విలీనంతో తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు, కంకిపాడు మండలాల్లో గ్రామ పంచాయతీల భవిష్యత్తు ప్రశ్నార్థకం మారింది. తాడిగడప మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరగక పోగా తాజాగా విలీనం చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పలు గ్రామ పంచాయతీల్లో శనివారం అత్యవసర సమావేశాలు నిర్వహించి, గ్రేటర్ వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. గ్రేటర్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం శనివారం తాత్కాలికంగా వాయిదా వేసినప్పటికీ భవిష్యత్తులో కొనసాగించే అవకాశం ఉండటంతో ఆందోళన నెలకొంది.
మున్సిపాలిటీ ఉంటుందా.. లేదా..?
2020లో యనమలకుదురు, కానూరు, తాడిగడప, పోరంకిలోని గ్రామాలతో తాడిగడప మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ జనాభా 2.30 లక్షల మంది ఉండగా డివిజన్లు 38 ఉన్నాయి. పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు. ఇంతవరకు వ్యవహారం బాగానే ఉన్నా తాడిగడప మున్సిపాలిటీని గ్రేటర్‌లో కలపాలా వద్దా అనే విషయం అనేక విమర్శలకు తావిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోకి పెనమలూరు ప్రాంతాన్ని విలీనం చేయటంపై స్థానికులు ఆహ్వానిస్తున్నారు. అయితే తాడిగడప మున్సిపాలిటీతో పాటు పెనమలూరు మండలంలోని ఆరు గ్రామాలు గ్రేటర్ విజయవాడలో విలీనం చేయవద్దని గ్రామ పంచాయతీలు తీర్మానం చేయగా స్థానిక ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు.
బతుకు భారమే..
గతంలో గ్రామ పంచాయతీలు తాడిగడప మున్సిపాలిటీలో విలీనం తరువాత ఇంటి పన్నులు 150 శాతం పెరిగాయి. అలాగే ఆస్తి బదలాయింపు(మ్యుటేషన్) బాదుడు కూడా అధికమైంది. ట్రేడ్ లైసెన్స్, ఖాళీస్థలాల పన్నులు, ఇంటిప్లాన్‌ల ఫీజులు ఇలా అనేక రకాలుగా పన్నులు ప్రజలపై ఆర్థిక భారం పడింది. ఇప్పుడు గ్రేటర్‌లోకి విలీనం చేస్తే ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమిటనే ప్రశ్నతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గ్రేటర్‌లో కలపటం వలన తమకు వచ్చే ప్రయోజనం శూన్యమనే అభిప్రాయాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అధికార వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని నిపుణులు చెబుతున్నారు.
పొలాలను ఏమి చేస్తారు..?
పెనమలూరు నియోజకవర్గంలో గ్రామాలు పాడి పంటలతో గ్రామీణ వాతావరణం ఉంటుంది. నియోజకవర్గంలో దాదాపు 40 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు జరుగుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అర్బన్ చేయటం వలన పంట పొలాల భవిష్యత్తు మసకబారనుంది. ఆహార ధాన్యాలు, కూరగాయలు ప్రియమవుతాయి. వ్యవసాయం పైనే ఆధారపడిన రైతులు, రైతు కూలీలు కుటుంబాలు, పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవసాయ ఆధారిత ఉత్పత్తుల కొరత ఏర్పడుతుంది. ఇప్పటికే వేలాది ఎకరాల్లో ఉన్న రాజధాని అమరావతి అభివృద్ధి పరిస్థితి అంతుపట్టకుండా ఉంది. ఈ పరిస్థితిలో గ్రేటర్ ప్రతిపాదనలు పేద, మధ్య తరగతి కుటుంబాలకు పెనుభారంగా మారుతుందన్న ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నాయి.
గ్రేటర్ అయితే గోడు వినేది ఎవరు ?
పెనమలూరును గ్రేటర్‌లో విలీనం చేస్తే ప్రజల గోడు వినేది ఎవరని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీలు ఉంటే అధికారులను నేరుగా కలవటానికి అవకాశం ఉంటుందని తెలుపుతున్నారు. గ్రేటర్ పరిధి ఎక్కవగా ఉంటే అనేక సమస్యలు ఉంటాయని, నిధులు తమ ప్రాంతాలకే వినియోగిస్తారనేది గ్యారెంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లాభం కంటే నష్టమే ఎక్కువని ప్రజలు తెలుపుతున్నారు.
గ్రేటర్ ప్రతిపాదన వాయిదా
గ్రేటర్ ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. మంత్రి నారాయణ శనివారం కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశం జరిపారు. అయితే జనగణన ముందు గ్రేటర్‌లోకి విలీనానికి సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయని సీఎం చెప్పారని, గ్రేటర్ ప్రతిపాదనను వాయిదా వేశామని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం గ్రేటర్ ప్రతిపాదనలు హడావుడిగా తెరపైకి తీసుకువచ్చి రాత్రికి రాత్రే గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేయాలని ఆదేశించడంతో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.


