ఉత్సాహంగా బాలోత్సవ్
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులోని విజయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ కళాశాల ప్రాంగణంలో బాలోత్సవ్ సంబరాలు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ చిల్ట్రన్స్ స్కూల్స్ ట్యుటోరియల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. వీసీఎస్‌టీఏ అధ్యక్షుడు ముదిగొండ శ్రీహరిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని పలు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులకు స్పోర్ట్స్, కల్చరల్, అకడమిక్ కేటగిరీల్లో గ్రూపులుగా విభజించి పోటీలు నిర్వహించారు.
విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలి
ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల్లో పోటీతత్వం పెరగాలని అప్పుడే చదువు, క్రీడల్లో ఉన్నతంగా రాణించగలరని బాలోత్సవాల సమన్వయకర్త పిన్నమనేని మురళీకృష్ణ అన్నారు. బాలోత్సవ్‌లో భాగంగా జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి పోటీల ద్వారా విద్యార్థుల్లో పోటీత్వం అలవడుతుందన్నారు. నిత్యం క్రీడలు ఆడటం ద్వారా మానసిక ప్రశాంతతో పాటు శారీరక దారుఢ్యం సొంతమవుతుందని సూచించారు. మార్కులే కొలమానం కాకుండా విలువలతో కూడిన విద్య అందించాలన్నారు. వీసీఎస్‌టీఎ బాలోత్సవం చైర్మన్ వెనిగళ్ల మురళీమోహన్ మాట్లాడుతూ.. 2011లో మొదలైన బాలోత్సవ్ సంబరాలు 11వ సంతాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెట్టాయన్నారు. రెండో రోజు కార్యక్రమాల అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. వీసీఎస్‌టీఏ కార్యదర్శి భీమిశెట్టి గణేష్ బాబు, కోశాధికారి పుప్పాల శ్రీనివాసరావు, కో చైర్మన్ అనుమాటి చెన్నయ్య, తాళ్లూరి శ్రీనివాసరావు, విజయ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు, లిటిల్ బ్రెయిన్స్ హైస్కూల్ డైరెక్టర్ ఫణి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


