హరిత గోపాలం.. పాడి రైతులకు వరం
చిట్టినగర్(విజయవాడపశ్చిమ): మేత సాగు, మేత నర్సరీల ఏర్పాటుకు హరిత గోపాలం పథకం పాడి రైతుల పాలిట వరమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్(విజయ డెయిరీ) పరిపాలనా భవనంలో శనివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తొలుత చైర్మన్ చలసాని అధ్యక్షతన బోర్డు డైరెక్టర్ల సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం మీడియాతో చైర్మన్‌తో పాటు ఎండీ కొల్లి ఈశ్వరబాబు, బోర్డు డైరెక్టర్లు దాసరి బాలవర్ధనరావు, వేమూరి సాయిలతో పాటు ట్రస్ట్ సభ్యులు హాజరయ్యారు. మేత కొరతను పరిష్కరించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద పశుగ్రాసం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చైర్మన్ పేర్కొన్నారు. పథకానికి అవసరమైన పూర్తి విధి విధానాలను రూపొందించిన ఏపీ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ ఎం.కృష్ణతేజకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ పథకం వినియోగించుకోవడం ద్వారా మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడంతో పాటు మామిడి, పామ్ ఆయిల్ తోటల్లో అంతర పంటగా సాగు చేసి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ స్థలాలు, కమ్యూనిటీ స్థలాలు, దేవదాయ భూములలో గడ్డి పెంచుకునే వెసులబాటు ఉందని చెప్పారు.


