తిరోగమనం
గ్రామాల్లో నిలిచిపోయిన ఆరోగ్య కార్యక్రమాలు మందులు, వైద్య పరికరాలు లేక రోగులకు ఇక్కట్లు బెజవాడలో విజృంభించిన అతిసార వణికించిన అరుదైన స్క్రబ్ టైఫస్ జ్వరం ఎ.కొండూరు గిరిజన తండాల్లో ఆగని కిడ్నీ బాధితుల మరణాలు
ప్రభుత్వ వైద్యం..
స్క్రబ్ టైఫస్‌తో ఆందోళన
సుత్సుగమూషి అనే కీటకం కుట్టడం వల్ల సోకే అరుదైన జ్వరం స్క్రబ్ టైఫస్. ఈ జ్వరం పదేళ్లుగా సోకుతున్నప్పటికీ ఈ ఏడాది ప్రజలను భయాందోళనకు గురిచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడం, పలువురు మృతి చెందడంతో కొత్తరకం జ్వరంగా ప్రచారం జరిగింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన 20 మంది వరకూ స్క్రబ్ టైఫస్ బారిన పడ్డారు. ఉయ్యూరు మండలం ముదునూరుకు చెందిన ఒకరు మృతి చెందారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఈ వ్యాధి ప్రజలను ఆందోళన చెందేలా చేసింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో వైరస్ జ్వరాలు విజృంభించాయి.
పనిచేయక
ప్రభుత్వాస్పత్రిలో
పక్కన పడేసిన
వెంటిలేటర్లు (ఫైల్)
లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రభుత్వ వైద్య సేవలు 2025వ సంవత్సరంలో తిరోగమనంలో పయనించాయి. ఆరోగ్య కార్యక్రమాలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్య పరికరాలు లేక, మందులు అందక అవస్తలు పడ్డారు. మరోవైపు సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులు సైతం విజృంభించాయి. విజయవాడలో నగర పాలక సంస్థ సరఫరా చేసే కలుషిత నీరు తాగి ఈ ఏడాది సెప్టెంబర్‌లో దాదాపు 300 మందికిపైగా అతిసార బారిన పడటం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపింది. నవంబర్, డిసెంబర్ నెలల్లో అరుదైన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. మరోవైపు ఎ.కొండూరు మండలంలోని తండాల్లో కిడ్నీ బాధితుల మరణాలు ఈ ఏడాది కూడా ఆగలేదు. ఇలా 2025వ సంవత్సరం ప్రభుత్వ వైద్యంలో అనేక లోపాలను ఎత్తిచూపింది.
బెజవాడను వణికించిన అతిసార
ఈ ఏడాది సెప్టెంబర్ పదో తేదీన విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో ప్రజలు అతిసార ప్రబలింది. తొలిరోజు దాదాపు వంద మంది వరకూ అతిసార బారిన పడటంతో అధికారులు ఉలికిపాటుకు గురయ్యారు. అప్రమత్తమైన వైద్య ఆరోగ్య శాఖ, నగర పాలక సంస్థ సిబ్బంది కాలనీలోకి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తొలుత వినాయకచవితి నిమజ్జనంలో కలుషిత ఆహారం తినడంతో అతిసార సోకిందని అధికారులు కొట్టిపారేశారు. అయితే అతిసార కేసులు రోజు రోజుకు పెరిగి పదిరోజులు కొనసాగాయి. దీంతో
నగరపాలక సంస్థ కుళాయిల ద్వారా సరఫరా చేస్తున్న తాగునీటిని పరీక్ష చేయించగా ఆ నీటితో పాటు, భూ గర్భ జలాలు సైతం కలుషితమైనట్లు తేలింది. దాదాపు 300 మంది వరకూ అతిసార బారిన పడగా, వారిలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
దిగజారిన ప్రభుత్వ సేవలు
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాల కల్పన తిరోగమనంలో పయనిస్తోంది. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రస్తుతం ఉన్న వెంటిలేటర్‌లు పనిచేయక పోవడంతో వాటిని పక్కడ పడేశారు. కోవిడ్ సమయంలో 200 వరకూ వెంటిలేటర్‌లను గత ప్రభుత్వం అందించింది. వాటితోనే ఇప్పటి వరకూ నెట్టుకొచ్చారు. అవి పనిచేయక పోవడంతో మూడు నెలల కిందట వాటన్నింటినీ పక్కన పెట్టారు. కొత్త వెంటిలేటర్‌ల కొనుగోలు చేయాలని నిర్ణయించినా అది కార్యరూపం దాల్చక పోవడంతో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో సైతం సిబ్బంది, వైద్యుల కొరత, సౌకర్యాల లేమి వంటివి సేవలను దిగ జారేలా చేశాయి. అంతేకాదు ఒక్కొసమయంలో బీపీ మందులు, గ్యాస్‌ట్రబుల్‌కు వాడే పాంటాప్ మాత్రలు కూడా ఉండని పరిస్థితి నెలకొంటుంది. మరోవైపు ఫ్యామిలీ ఫిజీషియన్ సేవలు నిలిచిపోవడంతో గ్రామీణ ప్రజలు వైద్య సేవలు మరింత దూరం అయ్యాయి.
వివాదాస్పదంగా పీపీపీ అంశం
రాష్ట్రంలోని నూతన వైద్య కళాశాలలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరణ చేయడం ఈ ఏడాది వివాదాస్పదంగా మారింది. వైద్య కళాశాలలు ప్రైవేటుకు అప్పగిస్తే పేద, మధ్యతరగతి ప్రజలకు వైద్యం, వైద్య విద్య దూరం అవుతుందని పలువురు మేధావులు, సంఘాలు సైతం ఆందోళన వ్యక్తంచేశాయి. వైఎస్సార్ సీపీ ఒక అడుగు ముందకేసి అన్ని వర్గాల ప్రజల నుంచి సంతకాల సేకరణ చేపట్టింది. ఇలా ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలో దాదాపు తొమ్మిది లక్షల మంది నుంచి సంతకాలు సేకరించారు. మచిలీపట్నంలో ఏర్పాటు చేసిన నూతన వైద్య కళాశాలలో చదువుతున్న పిల్లలు, అక్కడ అభివృద్ధి చెందిన ఆస్పత్రినే నిదర్శనంగా చూపుతున్నారు.
ఈ ఏడాది గంపలగూడెం మండలం అనుమోలు లంకలో బర్డ్ ఫ్లూ సోకి వేలాది కోళ్లు మరణించాయి. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అయితే మనుషులకు ఎవరికీ ఈ వ్యాధి సోకలేదు.
తిరోగమనం
తిరోగమనం
తిరోగమనం
తిరోగమనం


