గన్నవరం వెటర్నరీ కాలేజీలో ర్యాగింగ్!
కొత్త బ్యాచ్ విద్యార్థులకు చుక్కలు చూపుతున్న సీనియర్లు రాత్రిళ్లు హాస్టల్ గదుల్లోకి వచ్చి వేధింపులకు పాల్పడుతున్న వైనం తల్లిదండ్రులకు చెబితే కాలేజీ మానుకోవాల్సి వస్తుందని హెచ్చరిక విషయం తెలిసినా పట్టించుకోని ప్రిన్సిపాల్, ప్రొఫెసర్లు
సాక్షిప్రతినిధి, విజయవాడ: గన్నవరం వెటర్నరీ కళాశాలలో ర్యాగింగ్ శ్రుతిమించింది. కొత్త బ్యాచ్ (బీవీఎస్సీ) విద్యార్థులు నిద్ర లేని రాత్రుళ్లు గడపాల్సి వస్తోంది. పరిచయం పేరుతో సీనియర్లు వికృత చేష్టలకు పాల్పడుతుండటంతో జూనియర్లు హడలిపోతున్నారు. తల్లిదండ్రులకు చాటుగా ఫోన్ చేసి కష్టం చెప్పుకొని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఫిర్యాదు చేస్తే ఎక్కువ వేధింపులు తప్పవని సీనియర్లు హెచ్చ రిస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. ఉన్నత విద్యలో ర్యాగింగ్‌ను నివారించేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా, ఆచరణలో ప్రిన్సిపాళ్లు, ప్రొఫెసర్లు, వార్డెన్లు దృష్టి పెట్టకపోవడంతో కొత్త విద్యార్థులకు కష్టాలు తప్పడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదు చేసినా, వార ఎవరో సీనియర్లకు తెలిసిపోతోందని బాధితులు వాపోతున్నారు. కొంత మంది ప్రొఫెసర్లు, సిబ్బందికి తెలిసినా ఇదంతా మామూలేనని, పట్టించుకోవద్దంటూ జూనియర్లకు సూచిస్తూ సీనియర్లకే వత్తాసు పలుకుతున్నారని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రుళ్లు సీనియర్లు హాస్టల్ గదుల్లోకి వచ్చి, చిత్ర విచిత్ర పనులు చేయమంటున్నారని, ఒప్పుకోకపోతే బూతులు తిడుతున్నారని విద్యార్థులు చెబుతున్నారు. అమ్మాయిలు సైతం ర్యాగింగ్ దెబ్బకు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాగా చదువుకుందామని వస్తే ఇదేం అన్యాయం అని వాపోతున్నారు. ఇక్కడ జరిగేది ఎవరికై నా చెబితే.. ఈ కాలేజీలో ఎలా చదువుతారో చూస్తామని సీనియర్లు హెచ్చరించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో ర్యాగింగ్ నివారణ చర్యలు అనేవి కేవలం కాగితాలకే పరిమితం అయిందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసినా సీనియర్లను కనీసం పిలిచి హెచ్చరించలేదని ఓ విద్యార్థి తండ్రి వాపోయాడు. ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.


