ఉపాధి చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): గ్రామాల్లో కూలీల వలసలు నివారించి ఉపాధి కల్పించే లక్ష్యంతో 2005లో అప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాల్సిందేనని వ్యవసాయ కార్మిక, రైతు, కౌలు రైతు సంఘాలు, కార్మిక, పౌర సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని యథతథంగా కొన సాగించాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘాలు, రైతు, కౌలు రైతు సంఘాలు, కార్మిక, పౌర సంఘాలు శనివారం చలో లోక్ భవన్ కార్యక్రమం చేపట్టాయి. లెనిన్ సెంటర్ నుంచి లోక్ భవన్ వరకు ర్యాలీగా వెళ్లాలని ఆయా సంఘాలు, ఉపాధి కూలీలు సన్నద్ధమవగా, వారు లోక్ భవన్‌కు వెళ్ల కుండా పోలీసులు భారీగా మోహరించారు. అలంకార్ సెంటర్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తొలుత రైతు సంఘాల నాయకులు, ఉపాధి కూలీలు ధర్నా చౌక్‌లో ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వి. వెంకటేశ్వర్లు, ఆవుల శేఖర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, దడాల సుబ్బారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చి 20 కోట్ల మంది గ్రామీణ పేదలకు తీరని ద్రోహం చేస్తోందన్నారు. చట్టాన్ని పూర్తిగా ఎత్తివేసే కుట్రలో భాగంగానే మార్పులు చేసిందని మండిపడ్డారు. కొత్త చట్టం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమన్నారు. ఈ చట్టం వల్ల రాష్ట్రాలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రాల వాటా పెంచడ మంటే కేంద్రం తన బాధ్యత నుంచి తప్పించుకోవడమేనన్నారు. వీబీ జీరామ్ జీ చట్టాన్ని రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అనంతరం లోక్ భవన్‌కు బయలుదేరిన రైతు సంఘాలు, ఉపాధి కూలీలను ధర్నా చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీగా లోక్ భవన్‌కు వెళ్లడానికి వీల్లేదని, రైతు సంఘాల ప్రతినిధులను పంపు తామని పోలీసులు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం 15 మంది సభ్యులతో కూడిన ప్రతినిధి బృందాన్ని లోక్ భవన్‌కు అనుమతించారు. ప్రతినిధి బృందం లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. కేంద్రం దిగివచ్చి కొత్తగా తెచ్చిన చట్టాన్ని రద్దు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జనవరి మొదటి వారంలో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామ న్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్య దర్శులు కె.ప్రభాకర్‌రెడ్డి, కె.వి.వి.ప్రసాద్, కోటేశ్వరరావు, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం. హరిబాబు, సీనియర్ రైతు సంఘం నాయకులు వై. కేశవరావు, మర్రాపు సూర్యనారాయణ, డి.హరినాథ్, వి.శివనాగరాణి, కోట కల్యాణ్, అప్పారావు, పిల్లి రామకృష్ణ, వి.అన్వేష్, పవన్, జమలయ్య తదితరులు పాల్గొన్నారు.
గవర్నర్‌ను కలిసి వినతి పత్రం అందజేసిన రైతు సంఘాల ప్రతినిధులు
ఉపాధి చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలి


