యువత సేవా భావం అలవరచుకోవాలి | - | Sakshi
Sakshi News home page

యువత సేవా భావం అలవరచుకోవాలి

Dec 28 2025 7:24 AM | Updated on Dec 28 2025 7:24 AM

యువత సేవా భావం అలవరచుకోవాలి

యువత సేవా భావం అలవరచుకోవాలి

యువత సేవా భావం అలవరచుకోవాలి

సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సిద్ధార్థ పూర్వవిద్యార్థుల్లో ప్రముఖులకు సత్కారం

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత సేవాభావం, కలిసి పనిచేసే తత్వాన్ని అలవరచుకోవాలని సుప్రీం కోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు సూచించారు. సిద్ధార్థ కళాశాల స్వర్ణోత్సవాల సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న కళాశాల పూర్వ విద్యార్థుల్లో ఎంపికచేసిన 36 మందిని శనివారం సిద్ధార్థ ఆడిటోరియంలో సత్కరించారు. ముఖ్యఅతిథి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. జీవితంలో విజయం సాధించడం అంటే నగదు ఆర్జించడం ఒక్కటే కాదని, నైతికత కూడా ముఖ్యమని అన్నారు. జీవితంలో డబ్బు అవసరమే కానీ సర్వస్వం కాదనే విషయాన్ని యువత గుర్తుంచుకోవాలన్నారు. ఐదు పదుల ప్రస్థానం ఏ విద్యాసంస్థకై నా మైలురాయేనని, అందుకు పాలకవర్గం అంకితభావం, ఐక్యత ప్రశంశనీయమని సిద్ధార్థ అకాడమీ సభ్యులను అభినందించారు. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందరావు, అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కనకమేడల రవీంద్రకుమార్‌, సినీ దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య, సైంటిస్ట్‌ డాక్టర్‌ వి.డి.వి.పద్మజ, చెరుకూరి విజయేశ్వరిదేవి, శామ్‌సంగ్‌ (ఆర్‌అండ్‌డీ) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గోలి మోహనరావు, విజయ బ్యాంక్‌ పూర్వ జీఎం వై.నాగేశ్వరరావు, గీతమ్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ కొల్లూరు శ్రీకృష్ణ, ఐఐటీ (ముంబాయి) ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుబ్రహ్మణ్యేశ్వరరావు తదితరులను సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు మలినేని రాజయ్య, కార్యదర్శి పాలడుగుల లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలితప్రసాద్‌ సత్కరించారు. సిద్ధార్థ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌, జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.వెంకటేశ్వర్లు, సిద్ధార్థ అకాడమీ సభ్యులు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement