ఉసురు తీసిన దోమల చక్రం
కృష్ణలంక(విజయవాడతూర్పు): దోమల చక్రం బాలుడి ఉసురు తీసిన ఘటన కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాణిగారితోట, తారకరామనగర్‌కు చెందిన చిప్పల అనిల్‌కుమార్ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అతడికి భార్య అరుణకుమారి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారిలో ఓ కుమారుడు సమర్పణపాల్(9) ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. గత ఆదివారం అనిల్‌కుమార్, తన కుమారుడు సమర్పణపాల్‌తో కలిసి ఇంట్లోని ఓ గదిలో నిద్రపోయారు. దోమలు అధికంగా ఉండడంతో తెల్లవారుజామున దోమల చక్రం వెలిగించి మంచం కింద పెట్టుకున్నారు. ప్రమాదవశాత్తు అది దుప్పటికి అంటుకుని మంటల వ్యాపించాయి. ఆ మంటలు దుప్పటి కప్పుకుని నిద్రపోయిన పాల్‌కు కూడా అంటుకుని ముఖం, చేతులు, పొట్ట కాలిపోయి గాయాలయ్యాయి. ఆ పక్కన ఉన్న తండ్రి స్వల్పంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు చుట్టుపక్కల వారి సహాయంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శనివారం సాయంత్రం మృతిచెందాడు. బాలుడి తల్లి అరుణకుమారి శనివారం ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.


