180 కేజీల గంజాయి పట్టివేత
ఆత్కూరు(గన్నవరం): వ్యాన్‌లో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అదుపులోకి తీసుకుని రూ.90 లక్షల విలువైన 180 కేజీల గంజాయిని ఆత్కూరు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు గన్నవరం డీఎస్పీ సీహెచ్. శ్రీనివాసరావు తెలిపారు. ఆత్కూరు పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శనివారం ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 26న పెద్దఆవుటపల్లిలోని ఈశాన్య గార్డెన్స్ ఖాళీ ప్లాట్లలో ఓ వ్యాన్‌తో పాటు కారు ఆగి ఉండి ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండడంపై ఈగల్ టీమ్ ద్వారా ఆత్కూరు పోలీసులకు సమాచారం అందించింది. ఎస్‌ఐ ఎన్‌ఎల్‌ఎన్. మూర్తి నేతృత్వంలో సిబ్బంది అక్కడికి చేరుకోవడం గమనించి సదరు వ్యక్తులు పారిపోయే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని పట్టుకుని ప్రశ్నించగా ఒడిశాలోని జనతాపై గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి బెంగళూరు తరలిస్తున్నట్లుగా సదరు వ్యక్తులు అంగీకరించారు.
పైలెట్ వాహనంగా కారు..
థర్మకోల్ బాక్స్‌ల్లో ప్యాక్ చేసిన ఒక్కొక్కటి రెండు కేజీలు ఉన్న మొత్తం 90 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. పోలీసులకు కంట పడకుండా గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యాన్‌కు ముందు పైలెట్ వాహనంగా కారుతో బెంగళూరు తరలిస్తున్నారన్నారు. పట్టుబడిన వారిలో కర్ణాటకలోని చామరాజనగర్‌కు చెందిన సన్నప్ప మారెప్ప ఈజీగా డబ్బు సంపాదించేందుకు గంజాయి అక్రమ రవాణాను ఎంచుకున్నట్లు తెలిపారు. అతనితో పాటు విశాఖపట్నానికి చెందిన బంటు తాతారావు, బొమ్మినాయిని మోహన్‌రావు, గుండేపల్లి అభిరామ్‌సంపత్, పాయకరావుపేటకు చెందిన గరికన రాజేష్‌పై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. గంజాయిను పట్టుకున్న అధికారులను, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో హనుమాన్‌జంక్షన్ సీఐ ఎల్.రమేష్, ఎస్‌ఐ మూర్తి, ఈగల్ టీమ్ సీఐ ఎం.రవీంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కూచిపూడి నృత్యంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న మద్దిరాల కేతనరెడ్డికి ‘నవ తెలుగు తేజం – శ్రీ లలిత శ్రావంతి అవార్డు దక్కింది. ఆదిలీలా ఫౌండేషన్ ఆధ్వర్యాన విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు అవార్డు ప్రదానం చేశారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన మద్దిరాల కేతనరెడ్డి కూచిపూడి ప్రదర్శనలో అబ్బురపరుస్తోంది. కేతన ఇప్పటికే భారతీయ శాసీ్త్రయ నృత్య ప్రపంచంలో సత్తా చాటింది. తన ప్రదర్శన సమయంలో తన చేతుల్లో దీపాలను పట్టుకుని, హులా హూప్ చేస్తూ, తన తలపై కుండను నైపుణ్యంగా బ్యాలెన్స్ చేసింది. ఐదు నిమిషాల పాటూ ఆమె అద్భుతం చేసి చూపించింది. కేతన మూడేళ్ల వయస్సులో కూచిపూడి నేర్చుకోవడం ప్రారంభించి ఎన్నో మెడల్స్ అవార్డులు సాధించింది. గతంలో ఆమెను మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించారు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకోవడం లక్ష్యమని కేతనరెడ్డి తెలిపింది.
180 కేజీల గంజాయి పట్టివేత


