దుర్గమ్మకు కానుకగా బంగారపు నానుతాడు, మంగళసూత్రాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు చిత్తూరుకు చెందిన భక్తురాలు రూ. 3.50 లక్షల విలువైన బంగారపు నానుతాడు, మంగళసూత్రాలను కానుకగా సమర్పించారు. చిత్తూరుకు చెందిన లక్ష్మీశిల్ప 27గ్రాముల బంగారంతో నానుతాడు, మంగళసూత్రాలను తయారు చేయించి ఆలయ అధికారులకు అందజేశారు. బంగారు ఆభరణాన్ని ఉత్సవాల సమయంలో అమ్మవారికి అలంకరించాల్సిందిగా దాత ఆలయ అధికారులను కోరారు. అనంతరం దాతకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం అమ్మ వారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు.
మైలవరం: ౖమెలవరం డాక్టర్ లకిరెడ్డి హనిమిరెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ డీఏ లీగ్ మ్యాచ్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగుతోంది. మంగళవారం పెన్నా జట్టు 2–0 ఆధిక్యంతో గోదావరి జట్టుపై విజయం సాధించింది. కోరమాండల్‌పై వంశధార జట్టు 0–1 గోల్స్ తేడాతో గెలిచింది. మూడో మ్యాచ్ కోల్లేరు వర్సెస్ నల్లమల జట్ల మధ్య జరగ్గా కొల్లేరుపై 2–1 గోల్స్‌తో నల్లమల విజయం సాధించింది. 4వ మ్యాచ్‌లో విశాఖ జట్టుపై తుంగభద్ర 0–2 గోల్స్ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లకు ముఖ్య అతిథులుగా జాస్తి వెంకటేశ్వరరావు, ఎల్‌జీఎం కోఆర్డినేటర్, జి. రవీంద్ర పాల్గొన్నట్లు ఎన్టీఆర్ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శేషగిరిరావు, టోర్నమెంట్ చైర్మన్ బి. చక్రవర్తి తదితరులు హాజరయ్యారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): జిల్లాలో ఆరోగ్య సేవలు, కార్యక్రమాలను మరింత బలోపేతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మాచర్ల సుహాసిని ప్రోగ్రామ్ అధికారులకు సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో పనిచేస్తున్న ఆరోగ్యశాఖ ప్రోగ్రామ్ అధికారులతో మంగళవారం డీఎంహెచ్‌ఓ 13 కీలక ఆరోగ్య సూచికల్లో జిల్లా పనితీరుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా సేవలు బలోపేతం, అన్ని పారామీటర్లలో 100% విజయాన్ని నిర్ధారించడానికి స్పష్టమైన సూచనలు జారీ చేశారు. ఆరోగ్య సేవల్లో సెప్టెంబర్‌లో జిల్లా 6వ స్థానంలో నిలిచిందని, ప్రస్తుతం 4వ స్థానానికి చేరుకున్నట్లు డీఎంహెచ్‌ఓ తెలిపారు. కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఇందుమతి, డీపీఎంఓ డాక్టర్ నవీన్, డాక్టర్ మాధవి నాయుడు, డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ స్నేహ సమీరా, డాక్టర్ సునీల్, డాక్టర్ కార్తీక్, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
భవానీపురం(విజయవాడపశ్చిమ): ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎం), వీవీప్యాట్లను నిల్వ ఉంచిన గోడౌన్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా నెలవారీ సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో గల ఈవీఎం, వీవీప్యాట్ల గోడౌన్‌ను అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరుతోపాటు అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్‌లో సంతకం చేశారు. డీఆర్‌ఓ ఎం. లక్ష్మీనరసింహం, వైఎస్సార్ సీపీ ప్రతినిధి యరడ్ల ఆంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మకు కానుకగా బంగారపు నానుతాడు, మంగళసూత్రాలు


