దుర్గమ్మకు రూ.12.82 లక్షల వెండి సామగ్రి సమర్పణ
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ప్రకాశం జిల్లాకు చెందిన భక్తులు రూ.12.82లక్షల విలువైన వెండి సామగ్రి కానుకగా సమర్పించారు. చీమకుర్తికి చెందిన మారమ్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. కుటుంబంలో ఒక్కో సభ్యుడు అమ్మవారికి పూజలు, నివేదనలు సమర్పించేందుకు అవసరమైన వెండి సామగ్రిని తయారు చేయించి అందజేశారు. సుమారు 7.37 కిలోల వెండితో తయారు చేయించిన సామగ్రిని ఆలయ ఈవో శీనానాయక్‌కు అందించారు. ఎం. శివపార్వతి వెండి పళ్లెం (1.258కిలోలు), ఎం. వెంకటరెడ్డి వెండి గిన్నె (1.096), ఎం. శైలజ వెండి పళ్లెం (1.198), గోపిరెడ్డి సుధీర్‌రెడ్డి వెండి పళ్లెం (1.279), ఎం.పిచ్చమ్మ వెండి ప్లేట్(1.286), ఎం.వెంకట నాగజ్యోతి వెండి ప్లేట్ (1.286)లను ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.


