సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సర్వదర్శనం క్యూలైన్‌లో వచ్చే సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని ఉచితంగా కల్పించేందుకు దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ప్రయోగాత్మకంగా పరిశీలించింది. ప్రతి మంగళవారం మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు గంటల మధ్య వచ్చే భక్తులను ఉచితంగా అంతరాలయ దర్శనం కల్పించేందుకు దేవస్థాన ట్రస్ట్‌బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఈ కార్యక్రమానికి ట్రయల్ రన్ నిర్వహించారు. సర్వ దర్శనంలో వస్తున్న భక్తులను రూ.500 టికెట్ క్యూలైన్‌లోకి మళ్లించి వారికి అంతరాలయ దర్శనం కల్పించారు. సుమారు 1500 మందికి ఈ అవకాశం పొందినట్లు అధికారులు తెలిపారు. సామాన్య భక్తులకు అంతరాలయ దర్శనాన్ని పరిశీలించామని, త్వరలో జరిగే బోర్డు సమావేశంలో చర్చించి దేవదాయ శాఖ కమిషనర్ ఆమోదం నిమిత్తం పంపే ఆలోచన చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణతో పాటు ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


