హైకోర్టును తప్పుదోవ పట్టించే యత్నం
● ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి
● అక్రమ నిర్మాణాలు తక్షణం నిలిపివేయాలని ఆదేశం
కంచికచర్ల: జాతీయ రహదారి–65పై ఆర్టీసీ బస్టాప్ స్థానంలో అధికార పార్టీ నేతలు ఓ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు చేపట్టారు. అయితే దీనిపై గ్రామస్తులతో పాటు జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి హై కోర్టును ఆశ్రయించడంతో అక్రమ కట్టడాలని నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చింది. అయితే వారు ఆ ఆదేశాలు పాటించకుండా.. పాటిస్తున్నట్లు కోర్టును నమ్మించే యత్నం చేశారు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నిర్మాణాలు తక్షణమే నిలిపివేసేలా చూడాలని జిల్లా కలెక్టర్‌తో పాటు స్థానిక అధికారులను ఆదేశించింది.
ఆదాయ వనరుగా మార్చుకునేందుకు..
కీసర ప్రధాన కూడలి వద్ద హైవే అధికారులు 2004లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ బస్టాప్‌ను నిర్మించారు. ఆ బస్ షెల్టర్‌ను పడగొట్టి, ఆ స్థలంలో కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టేందుకు పచ్చనేతలు పూనుకున్నారు. సుమారు 15 గదులు నిర్మిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అధికారపార్టీ నాయకులు బస్‌షెల్టర్‌ను పడగొడుతున్నా కనీసం నేషనల్ హైవే అధికారులు, రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు పట్టించుకోలేదు. అంతేకాకుండా 30 ఏళ్ల క్రితం ఆ ప్రదేశంలో చిన్న చిన్న బడ్టీకొట్లు ఏర్పాటు చేసుకుని జీవనోపాధి పొందుతున్న వారిని సైతం అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దీంతో వారు జీవనోపాధి కోల్పోయారు.
హైకోర్టు ఉత్తర్వులు ఇలా..
గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులతో కలిసి జెడ్పీటీసీ సభ్యురాలు వేల్పుల ప్రశాంతి ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయించారు. వీరి వాదనలు విన్న న్యాయస్థానం అక్రమ కట్టడాలు తక్షణమే నిలిపివేయాలని పది రోజుల కిందట ఉత్తర్వులు ఇచ్చింది. అయినప్పటికీ పచ్చ పార్టీ నేతలు ఇష్టారీతిన కట్టడాలు నిర్మిస్తుండటంతో మరోసారి ఆమె హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీడియో సైతం చూపడంతో అక్రమ కట్టడాలు కట్టకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్, కంచికచర్ల తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శులదేనని కోర్టు తీర్చునిచ్చింది. బుధవారం జిల్లా కలెక్టర్, తహసీల్దార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలిచ్చింది.


