మెడికల్‌ కళాశాలకు ఐదుగురు కొత్త ప్రొఫెసర్లు | - | Sakshi
Sakshi News home page

మెడికల్‌ కళాశాలకు ఐదుగురు కొత్త ప్రొఫెసర్లు

Aug 31 2025 7:22 AM | Updated on Aug 31 2025 8:00 AM

మెడికల్‌ కళాశాలకు ఐదుగురు కొత్త ప్రొఫెసర్లు మెగా జాబ్‌ మేళాలో 89 మందికి ఉద్యోగాలు అనుమానాస్పద స్థితిలో వృద్ధుడి మృతి

మచిలీపట్నంఅర్బన్‌: స్థానిక శ్రీ పింగళి వెంకయ్య మెడికల్‌ కళాశాలకు ప్రభుత్వం ఐదుగురు కొత్త ప్రొఫెసర్లను నియమించింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్లుగా పనిచేసిన వైద్యులకు ఉద్యోగోన్నతి కల్పించి, వారిని మచిలీపట్నం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలకు బదిలీ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అనస్థీషియా విభాగానికి గుంటూరు నుంచి డాక్టర్‌ కె.నాగభూషణం, డెర్మటాలజీ విభాగానికి గుంటూరు నుంచి డాక్టర్‌ డి.యస్‌.యస్‌. శ్రీనివాస ప్రసాద్‌, ఇ.ఎన్‌.టి. విభాగానికి విజయవాడ నుంచి డాక్టర్‌ టి.వి.యస్‌.యస్‌.ఎన్‌.లీలా ప్రసాద్‌, గైనిక్‌, ప్రసూతి విభాగానికి విజయవాడ నుంచి డాక్టర్‌ జి.ఎల్‌.శోభిత, పిడియాట్రిక్‌ విభాగానికి ఒంగోలు నుంచి డాక్టర్‌ వై.శివరామకృష్ణ బదిలీ అయ్యారు.

గుడివాడటౌన్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ కృష్ణాజిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ఏఎన్‌ఆర్‌ కళాశాలలో జరిగిన జాబ్‌ మేళాలో 89 మంది యువతీ యువకులకు ఉద్యోగావకాశాలు లభించినట్లు జిల్లా ఉపాధి అధికారి డి.విక్టర్‌బాబు తెలిపారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రముఖ కంపెనీలు ఈ మేళాలో పాల్గొన్నాయన్నారు. మొత్తం 248 మంది యువతీ యువకులు హాజరు కాగా 89 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారని, 64 మంది పైస్థాయి ఇంటర్వ్యూలకు అర్హతలు సాధించారని ఆయన వివరించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ పీజేఎస్‌ కుమార్‌, కరస్పాండెంట్‌ కేఎస్‌ అప్పారావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ బీఎస్‌ఎస్‌ పద్మజ తదితరులు పాల్గొన్నారు.

తిరువూరు: స్థానిక మధిర రోడ్డులోని దేవసముద్రం చెరువులో శనివారం ఉదయం ఒక వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. చెరువులో మృతదేహాన్ని గుర్తించిన రైతులు పోలీసులకు సమాచారం అందించగా, మృతదేహాన్ని బయటికి తీశారు. మృతుడు పాత తిరువూరు ఎస్సీ కాలనీకి చెందిన మరకాల సుందరరావు(65)గా గుర్తించారు. బహిర్భూమికి వెళ్లి కాలు జారి చెరువులో పడి మరణించి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఎస్‌ఐ సత్యనారాయణ దర్యాప్తు చేపట్టారు.

మెడికల్‌ కళాశాలకు ఐదుగురు కొత్త ప్రొఫెసర్లు  1
1/1

మెడికల్‌ కళాశాలకు ఐదుగురు కొత్త ప్రొఫెసర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement