
బుడమేరు పాపం.. బాబు ప్రభుత్వానిదే
వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ రిటైనింగ్ వాల్ నిర్మించాలని డిమాండ్ సింగ్‌నగర్‌లో కొవ్వొత్తులతో నిరసన
నేటికీ ప్రజల గుండెల్లో భయం..
సమీక్షల పేరుతో కాలయాపన..
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడసెంట్రల్): బుడమేరు వరద వస్తోందని తెలిసినా.. ప్రజలను అప్రమత్తం చేసి కాపాడటంలో కూటమి ప్రభుత్వం అవలంబించిన నిర్లక్ష్య ధోరణి వల్లే విజయవాడ మునిగిందని.. లక్షల మంది ప్రజలు రోడ్డున పడ్డారని వైఎస్సార్ సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ విమర్శించారు. ఈ పాపం ముమ్మాటికి చంద్రబాబు ప్రభుత్వానిదేనని ఆరోపించారు. బుడమేరు వరద బీభత్సం జరిగి ఏడాది గడిచిన నేపథ్యంలో పార్టీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జి మల్లాది విష్ణు ఆధ్వర్యంలో బుడమేరు ముంపు బాధితులకు మద్దతుగా– ప్రభుత్వ వైఫల్యానికి వ్యతిరేకంగా సింగ్ నగర్ ఆంధ్రప్రభకాలనీలో ఆదివారం సాయంత్రం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న దేవినేని అవినాష్ మాట్లాడుతూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతేడాది బుడమేరు వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారని.. వేల ఇళ్లు నీట మునిగి.. లక్షల మంది సర్వం కోల్పోయి రోడ్డునపడే దుస్థితి ఏర్పడిందని గుర్తుచేశారు. వరద గురించి ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉన్నా.. కింద ఉన్న గ్రామాలు, విజయవాడ నగర ప్రజలకు సమాచారం అందించి వారిని సురక్షిత ప్రాంతాలకు చేరవేయడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వరదల్లో నష్టపోయిన బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం చివరికి దాతలు అందించిన రూ.600 కోట్లకు పైగా విరాళాలను కూడా కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, వాటర్ ప్యాకెట్లు పేరుతో పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. దొంగ సర్వేలతో బాధితులకు న్యాయం చేయకుండా ప్రభుత్వం చేతులు దులుపుకొందని విమర్శించారు.
కృష్ణా రిటైనింగ్ వాల్ మాదిరిగా..
కృష్ణానదికి నేడు ఇంత పెద్ద స్థాయిలో వరదనీరు వస్తున్నా కృష్ణలంక, రాణిగారితోట, రామలింగేశ్వరనగర్ కట్ట పరిసర ప్రాంత ప్రజలంతా నిశ్చింతగా ఉంటున్నారంటే దానికి కారణం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుచూపుతో నిర్మించిన రిటైనింగ్ వాలేనని అవినాష్ స్పష్టం చేశారు. అలాంటి వాల్ బుడమేరుకు కూడా నిర్మించి, రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వం అసమర్థత, ముందు చూపులేని కారణంగా ఏ కొద్దిపాటి వర్షం పడినా నేటికీ బుడమేరు వరద బాధితులు భయపడుతూనే ఉన్నారని వైఎస్సార్ సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం కళ్లు తెరిచి బుడమేరు ఆధునికీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని.. మిషన్ బుడమేరును కొనసాగించాలని డిమాండ్ చేశారు.
బుడమేరు వరదలు జరిగి ఏడాది కాలం గడిచినా కూటమి ప్రభుత్వం నేటికి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. కేవలం సమీక్షల పేరుతో సీఎం చంద్రబాబు కాలయాపన చేశారే తప్ప వాస్తవంగా బుడమేరు పరిరక్షణకు ఈ ప్రభుత్వం చేసిందేమి లేదన్నారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజ, కార్పొరేటర్లు బీహెచ్‌ఎస్వీ జానారెడ్డి, ఎండీ షాహీనా సుల్తానా, శర్వాణీమూర్తి, కుక్కల అనిత, వైఎస్సార్‌సీపీ స్టూడెంట్ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, అన్ని డివిజన్ల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.