
ఆర్భాటమే.. ఆచరణ సున్నా
క్యూలోకి రాని.. ఐరన్ ఫ్రేమ్‌లు సింహాచలం నుంచి దిగుమతి అంటూ హడావుడి యఽథావిధిగా పాత క్యూలే ఆదేశాల అమలు ఏదీ!
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): సింహాచలం దేవస్థానంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో ఈ ఏడాది దసరాకు క్యూల ఏర్పాటులో ఐరన్ ఫ్రేమ్‌లను వినియోగిస్తున్నామని దుర్గగుడి అధికారులు ఆర్భాటంగా ప్రకటించినా.. ఆచరణలో కానరావడం లేదు. గత నెల 17న దుర్గగుడికి చెందిన సీవీ రెడ్డి చారిటీస్ కాటేజీ వద్ద ఐరన్ ఫ్రేమ్‌లతో ఏర్పాటు చేసిన క్యూలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు. దీనికి అవసరమైన ఐరన్ ఫ్రేమ్‌లను సింహాచలం దేవస్థానం నుంచి దిగుమతి చేసుకున్నామని ఇంజినీరింగ్ అధికారులు, సిబ్బంది ఎంతో ఘనంగా చెప్పుకున్నారు.
కార్యాచరణలో దిగే సరికి..
దసరా ఉత్సవాల ఏర్పాట్లను దుర్గగుడి అధికారులు గురువారం కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డులో మొదటి మలుపు వద్ద కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. దేవస్థానం ఏర్పాటు చేస్తానని చెప్పిన ఐరన్ ఫ్రేమ్‌లు కనీసం దుర్గగుడి పరిసరాలకు కూడా చేరలేదు. దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు ముందుగానే టెండర్లు పిలవడంతో కాంట్రాక్టర్ ఐరన్ ఫ్రేమ్‌లను బిగించడానికి ససేమిరా అన్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూ పనులు రెండు రోజులు ఎక్కడిక్కడే నిలిచిపోయాయి. ఉత్సవాలు సమీపిస్తుండటంతో చేసేది లేక పాత క్యూలనే ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్‌రోడ్డులో ఇప్పటికే బారికేడ్లతో క్యూ ఏర్పాటు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇక ఐరన్ ఫ్రేమ్‌ల క్యూలు ప్రకటనలకే పరిమితమైందని ఇంజినీరింగ్ సిబ్బంది బహిరంగంగానే పేర్కొంటున్నారు. ఐరన్ ఫ్రేమ్‌లతో క్యూలు ఏర్పాటు చేస్తున్నామని ఇంజినీరింగ్ విభాగం ముఖ్య అధికారులు పనుల వ్యయాన్ని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పాత విధానంతోనే క్యూలు ఏర్పాటు చేయడంతో అంచనాలను తగ్గిస్తారా లేక యధావిథిగానే బిల్లులు చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఎవరి జేబులో వేస్తారో వేచి చూడాల్సి ఉంది.
దేవదాయ శాఖ ఆదేశాలు బేఖాతర్...!
ఈ ఏడాది సింహాచలం దేవస్థానంలో చోటు చేసుకున్న రెండు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని దసరా ఉత్సవాల ఏర్పాట్లపై దేవదాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. చందనోత్సవం రాత్రి కురిసిన భారీ వర్షంతో గోడ కూలిపోవడం, సింహాచలం గిరి ప్రదక్షిణలో ఏర్పాటు చేసిన షెడ్డు కూలిపోయిన ఘటనలతో భక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది భారీ వర్షాలు, ఆకస్మిక అల్పపీడనాలు వస్తుండటంతో ఉత్సవాల ఏరా్పాట్లకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా క్యూల ఏర్పాటుపై అలసత్వం చూపొద్దని హెచ్చరించడమే కాకుండా ప్రభుత్వం ప్రత్యేక ఆదేశాలను జారీ చేసింది. కీలకమైన క్యూల ఏర్పాటులో దేవస్థానం దేవదాయ శాఖ ఆదేశాలను తుంగలోకి తొక్కి పెట్టింది. బారికేడ్లతో ఏర్పాటు చేసే వాటర్ ఫ్రూప్ టెంట్ల విషయంలోనూ చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.

ఆర్భాటమే.. ఆచరణ సున్నా