
విజృంభిస్తున్న విష జ్వరాలు
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు
పెడన: గ్రామాల్లో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు రోగులు క్యూ కడుతున్నారు. వైరల్ ఫీవర్‌గా ప్రభుత్వాస్పత్రులలో చికిత్స పొందుతూ సైలెన్ బాటిల్స్ పెట్టించుకుంటున్నవారు అనేకం ఉంటున్నారు. జ్వరాలు అధికంగా ఉన్నాయని, డెంగీ వంటి కేసులు ప్రభుత్వాసుత్రికి రావడం లేదని, పెడన పీహెచ్‌సీ వైద్యురాలు మీనాదేవి తెలిపారు. ఇక పెడన పట్టణంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రి అయితే జ్వరపీడుతులతో రద్దీగా ఉండటమే కాకుండా బెడ్‌లు ఖాళీ లేని పరిస్థితి. డెంగీ కేసులు నమోదవ్వడమే కాకుండా ప్లేట్‌లెట్స్ పడిపోతున్నాయని, పరిస్థితి తీవ్రంగా ఉన్న వారిని విజయవాడకు సిఫార్సు చేస్తున్నామని సదరు ప్రైవేటు వైద్యులు పేర్కొంటున్నారు. మరో పక్క ప్రభుత్వ వైద్యులు, ఇంటింటికీ తిరుగుతున్న ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఎక్కడా కూడా డెంగీ లేదనే చెబుతున్నారు. ప్రైవేటుగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నా అధికారికంగా గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. తమ వద్ద పరీక్షలు చేయించుకొని.. డెంగీ పాజిటివ్ నిర్ధారణ అయితే.. అప్పుడే కేసులున్నట్లుగా భావిస్తామనే వాదన వైద్యాధికారుల నుంచి వ్యక్తమవడం గమనార్హం. ఇప్పటికై నా క్షేత్రస్థాయిలో విషజ్వరాల అదుపునకు పటిష్ట చర్యలు చేపట్టాలని గ్రామ, పురప్రజలు మొరపెట్టుకుంటున్నారు.