
విజయవాడ కల్చరల్: జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ సాహిత్య జీవితంపై వ్యాస, పద్య రచన పోటీలను నిర్వహిస్తున్నట్లు సంస్కారభారతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంకుమార్ గూటాల తెలిపారు. సోమవారం సంస్థ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. తెలుగు సాహితీ మూర్తుల తేజోమయమైన జీవితాలను భావి తరాలకు అందించాలనే సంక్పలంతో కవి సామ్రాట్ విశ్వనాథ సాహిత్య సమాలోచన కార్యక్రమంలో భాగంగా పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంస్కారభారతి అఖిల భారత సంఘటన మంత్రి అభిజిత్ గోఖలే మాట్లాడుతూ విశ్వమంత కవి విశ్వనాథ అన్నారు. పోటీలలో ఉచితంగా పాల్గొనవచ్చని.. 6 నుంచి 10వ తరగతి వారికి జూనియర్, సీనియర్ విభాగాలలో తెలుగు పద్యపఠన, వ్యాస రచన పోటీలు, ఇంటర్ ఆపై చదివే వారు విశ్వనాథ కావ్య సమీక్ష, విశ్వనాథకు లేఖ అంశాలలో పోటీ పడవచ్చన్నారు. విజేతలకు నగదు బహుమతులుంటాయన్నారు. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 28లోపు 98480 35573 వాట్సాప్‌లో సంప్రదించాలని సూచించారు.