
దివ్యాంగ పింఛన్లపై కూటమి కుట్ర
●కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న వాటిని తొలగించటం దారుణం
●వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర నాయకుడు బందెల కిరణ్‌రాజ్
చిలకలపూడి(మచిలీపట్నం): దివ్యాంగ పింఛన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని వైఎస్సార్ సీపీ వికలాంగ విభాగం రాష్ట్ర నాయకుడు బందెల కిరణ్‌రాజు అన్నారు. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద దివ్యాంగులతో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని హామీ ఇచ్చి గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం.. ప్రస్తుతం దివ్యాంగుల పింఛన్లను తొలగించేందుకు కుట్ర చేస్తోందన్నారు. ప్రీ వెరిఫికేషన్, రీఎసెస్‌మెంట్ పేరిట వికలాంగులంతా మరోసారి వైద్యుల వద్దకు వెళ్లి సదరం సర్టిఫికెట్లు తీసుకోవాలని షరతులు పెట్టిందని, వైకల్యశాతం ఎంతో ఉందో వైద్యులతో ధ్రువీకరించి పర్సంటేజీతో సర్టిఫికెట్ తీసుకురావాలని కొత్త నిబంధనను ప్రవేశపెట్టిందన్నారు. దీంతో 10, 15ఏళ్లుగా పింఛన్లు తీసుకుంటున్న వికలాంగులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైకల్యశాతం 40 కంటే తగ్గిందన్న సాకుతో చాలా మంది పింఛన్లను తొలగించారన్నారు. వారిని మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సింది పోయి వారి ఆధారంపై దెబ్బకొట్టడం దారుణమన్నారు. పింఛన్ల తొలగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. లేని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామన్నారు. ధర్నా చేస్తున్న వారి వద్దకు డీఆర్వో కె. చంద్రశేఖరరావు వచ్చి వారి నుంచి వినతులు స్వీకరించారు. అలాగే వికలాంగ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.