
సాంకేతికతను అందిపుచ్చుకుంటేనే విజయం
ఉత్సాహంగా సీఏల స్నాతకోత్సవం
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): చార్ట్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కోర్సు పూర్తి చేసిన వారు సాంకేతికతను అందిపుచ్చుకుంటూ తమలోని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్ట్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) సెంట్రల్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ్ల శ్రీధర్ చెప్పారు. సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థుల కాన్వొకేషన్–2025 (స్నాతకోత్సవం) ఐసీఏఐ ఆధ్వర్యంలో సోమవారం ఉత్సాహపూరిత వాతావరణంలో మొగల్రాజపురంలోని ఫంక్షన్ హాలులో సోమవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీధర్ ముఖ్యఅతిథిగా హాజరై సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు.
వారధిగా సీఏలు..
ఐసీఏఐ జాతీయ అధ్యక్షుడు చరణ్‌జోత్‌సింగ్, ఉపాధ్యక్షుడు డి.ప్రసన్నకుమార్ ఆన్‌లైన్ ద్వారా మాట్లాడుతూ సీఏ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులను అభినందించారు. ప్రభుత్వానికి పన్ను చెల్లింపుదారులకు మధ్య సీఏలు వారధిగా ఉంటూ దేశ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారన్నారు. ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ చైర్మన్ కంచమరెడ్డి నారాయణ మాట్లాడుతూ సీఏ చదువుతున్న విద్యార్థులకు ఈ రంగంలో ఉన్న ఉపాధి అవకాశాలతో పాటుగా సీఏ రంగంలో వస్తున్న కొత్త చట్టాలు, పన్నుల విధానంపై అవగాహన తరగతులను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఐసీఏఐ సదరన్ ఇండియా రీజనల్ కౌన్సిల్ (ఎస్‌ఐఆర్‌సీ) వైస్‌చైర్మన్ ముప్పాళ్ల సుబ్బారావు, ఐసీఏఐ విజయవాడ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జయంత్, కార్యదర్శి మనీష్‌కుమార్ జైన్ పాల్గొన్నారు.