
సెల్‌ఫోన్లు, సిఫార్సు దర్శనాల కట్టడే లక్ష్యం
●రేపటి నుంచి సెల్‌ఫోన్లతో
ఆలయంలోకి నో ఎంట్రీ
●దుర్గగుడి ఈవో శీనానాయక్
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి ఆలయంలోనికి సెల్‌ఫోన్లతో ప్రవేశించకుండా నియంత్రించడమే కాకుండా సిఫార్సులతో దర్శనాలకు వచ్చే వారిని సైతం కట్టడి చేసి ఆలయ ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు దుర్గగుడి ఈవో శీనానాయక్ అన్నారు. అందులో భాగంగా ఈ నెల 27 నుంచి ఆలయ ప్రాంగణంలోకి సెల్‌ఫోన్లను అనుమతించమని ప్రకటించారు. మహామండపం నాల్గో అంతస్తులోని ఈవో చాంబర్‌లో సోమవారం ఆలయ ఏఈవోలు, సూపరిండెంటెంట్లు, ఇంజినీరింగ్ విభాగం, వైదిక కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అమ్మవారి ఆలయంలోకి సెల్‌ఫోన్లను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని, ఈ విధానం ఆలయ అధికారులు, సిబ్బంది నుంచే మొదలు పెట్టాలని సూచించారు. ఇతర దేవాలయాల్లో అమలవుతున్న సెల్‌ఫోన్ల నిషేధం దుర్గగుడిలో ఎందుకు అమలు కావడం లేదో అర్థం కాలేదని పేర్కొన్నారు. అదే విధంగా అమ్మవారి దర్శనానికి వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రముఖులతో పాటు పోలీసు, రెవెన్యూ, మీడియా నుంచి ఎక్కువగా సిఫార్సులు వస్తున్నాయని ఈవో పేర్కొన్నారు. ఇటువంటి దర్శనాలను కట్టడి చేసేందుకు స్కానింగ్ పాయింట్, టికెట్ పంచింగ్ పాయింట్లలో సిబ్బందిని తరచూ అంతర్గత బదిలీ చేస్తున్నామన్నారు.
సెప్టెంబర్ 15 నాటికి నూతన భవనాలు సిద్ధం
దసరా ఉత్సవాలకు ముందుగానే సెప్టెంబర్ 15వ తేదీ నాటికి అన్నదానం, ప్రసాదాల పోటు భవనాలను వినియోగంలోకి తీసుకువస్తామని ఈవో పేర్కొన్నారు. ఆయా భవనాల్లో నూతన మిషనరీ, వంట సామగ్రిని వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ ఆదేశించారన్నారు.
దసరాకు ఆల్‌లైన్‌లోనే ఆర్జిత సేవ టికెట్లు
ఉత్సవాలలో అమ్మవారికి ఖడ్గమాలార్చన, శ్రీచక్రనవార్చన, చండీహోమం, లక్ష కుంకుమార్చన నిర్వహించాలని దేవస్థానం నిర్ణయించిందన్నారు. మహా మండపం ఆరో అంతస్తులో ఆయా సేవలను నిర్వహిస్తారని, సేవా టికెట్లు కేవలం ఆన్‌లైన్ ద్వారా దేవస్థాన వైబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయనే విషయాన్ని భక్తులు గమనించాలన్నారు. ఉత్సవాలలో ఉదయం ఆరు గంటల నుంచి భక్తులకు అమ్మవారి ప్రసాద వితరణ జరుగుతుందని, ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అన్న ప్రసాదం, తిరిగి రాత్రి 9.30 గంటల వరకు పులిహోర, కదంబం అందజేస్తామన్నారు. సమీక్ష సమావేశంలో స్థానాచార్య శివప్రసాద్ శర్మ, అసిస్టెంట్ కమిషనర్ రంగారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కోటేశ్వరరావు, రాంబాబు, ఏఈవోలు, సూపరిండెంటెంట్లు పాల్గొన్నారు.