
విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం
చల్లపల్లి: విద్యుత్ స్తంభంపై షాక్‌కు గురై అక్కడి నుంచి కిందపడి ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మండల పరిధిలోని యార్లగడ్డలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే యార్లగడ్డ గ్రామానికి చెందిన బండారు బుజ్జి(48) యార్లగడ్డ పంచాయతీ కార్యాలయంలో వీధిలైట్ల ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. సర్వీసు వైరు విద్యుత్ తీగలకు కట్టే క్రమంలో ఎల్‌టీ లైను ఆపి స్తంభం ఎక్కి వైరు చుడుతుండగా పైనున్న మెయిన్ లైన్ తగిలి కరెంటు షాక్‌కు గురయ్యాడు. దాంతో అక్కడ నుంచి కిందపడిపోయాడు. వెంటనే చల్లపల్లి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా, మార్గంమధ్యలో 108 వాహనం వచ్చి పరీక్షించగా అప్పటికే అతను మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం బుజ్జి మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వత్సవాయి: గుర్తు తెలియని వివాహిత మృతదేహం శుక్రవారం గ్రామశివారులోని వేములనర్వ రహదారిలో మోడల్ కాలనీ సమీపంలో దొరికింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వత్సవాయి గ్రామశివారులోని మోడల్ కాలనీకి సమీపంలోని వ్యవసాయ బావిలో మృతదేహం ఉన్నట్టు స్థానికులు కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే పోలీసులు బావి వద్దకు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. సదరు మహిళ ఎవరు అనేది వివరాలు తెలియరాలేదు. మృతురాలికి సుమారు 30 నుంచి 35 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఒంటిపై నలుపు రంగు, చీర జాకెట్‌తో ఉన్నట్లు చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వాస్ప్రతికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ దుర్మరణం