
కృష్ణాజిల్లాలో ఘటన
కోడూరు: కూటమి ప్రభుత్వం అర్హులైన దివ్యాంగులకు కూడా పింఛన్లు రద్దు చేస్తోంది. పింఛన్లు తొలగించినట్లుగా అధికారులు ఇచి్చన నోటీసులతో వారు మండల పరిషత్ కార్యాలయాలు, సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే కృష్ణాజిల్లా కోడూరు పంచాయతీకి చెందిన భూపతి నాగమణికి పింఛను తొలగిస్తూ నోటీసు ఇచ్చారు. నాగమణికి ఒక్క కన్ను మాత్రమే ఉండడంతో ఆమెకు దివ్యాంగ పెన్షన్ రూ.6 వేలు వచ్చేవి.
సదరం సరిఫికెట్‌లో 40శాతం అంధత్వం ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇటీవల వైద్య పరీక్షల్లో 40శాతం లోపే ఉందంటూ పెన్షన్‌ను తొలగించారు. అధికారులు ఇచి్చన నోటీసులతో కోడూరు–1 సచివాలయానికి వెళ్లిన నాగమణి తనకు ఒక్క కన్ను మాత్రమే ఉందని, రెండోది పెట్టుడు కన్ను అంటూ కన్ను గుడ్డు తీసి సచివాలయ వెల్ఫేర్ సిబ్బంది చేతిలో పెట్టింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన బాధను చెప్పుకోవడం కోసమే కన్ను తీసి సచివాలయ ఉద్యోగి చేతిలో పెట్టినట్లు బాధితురాలు వాపోయింది.