
కలెక్టర్ డీకే బాలాజీ
మరింత పారదర్శకంగా ‘స్వమిత్వ’
పెడన: భవిష్యత్‌లో స్వమిత్వ పథకం మరింత పారదర్శకంగా ఉండటానికి పటిష్ట చర్యలు తీసుకోవడానికి నివేదిక రూపొందిస్తున్నామని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, అసిస్టెంట్ కలెక్టర్ ఫర్హీన్ జాహెదాలతో కలిసి మండలంలోని నేలకొండపల్లి, మడక గ్రామ పంచాయతీలను సందర్శించారు. ఈ సందర్భంగా అంతకు ముందు స్వమిత్వ సర్వే ఏ విధంగా చేసిందో రికార్డులు, మ్యాపులు, ఆన్‌లైన్ నమోదు తదితర వాటిని పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సర్వే సమయంలో ఎదురైన ఇబ్బందులు, సమస్యలు, గ్రామస్తుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వాటిని ఎలా ఎదుర్కొన్నది తదితర విషయాలపై ఆరా తీశారు. సర్వే సమయంలో సిబ్బంది సరిపోతారా లేక అదనంగా ఏమైనా కావాల్సి ఉందా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ బాలాజీ మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో గ్రామకంఠాల్లో ఇళ్లు, ఖాళీ స్థలాలపై ప్రజలకు యాజమాన్య హక్కులు కల్పించడం స్వమిత్వ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. నేలకొండపల్లి, మడక గ్రామాల్లో గతంలోనే సర్వే పూర్తైందని, ఆ సమయంలో క్షేత్రస్థాయిలో తలెత్తిన సమస్యలు, అందుకు అనుసరించిన విధి విధానాల గురించి సంబంధిత అధికారులు, సిబ్బంది నుంచి వివరాలు సేకరించామన్నారు. వీరితో పాటు జిల్లా పంచాయతీ అధికారి అరుణకుమారి, భూ రికార్డులు ల్యాండ్ సర్వే ఏడీ జోషిలా, డీఎల్‌పీవో రజావుల్లా, డీఎల్‌డీవో పద్మావతి, స్వమిత్వ నోడల్ అధికారి శైలజ తదితరులు పాల్గొన్నారు.