ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే | - | Sakshi
Sakshi News home page

ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే

Aug 23 2025 6:35 AM | Updated on Aug 23 2025 8:53 AM

ఆహారం

ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే

● గాంధీనగర్‌కు చెందిన 40 ఏళ్ల వ్యాపారి అర్ధరాత్రి వరకూ బిజినెస్‌ వ్యవహారాలు చూస్తుంటారు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా నాన్‌వెజ్‌ వంటకాలు తింటుంటారు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుని వద్దకు వెళ్లారు.అక్కడ పరీక్షలు చేసి జీర్ణాశ్రయ క్యాన్సర్‌ వచ్చినట్లు నిర్ధారించారు. ● కానూరుకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటారు. నాన్‌వేజ్‌, బిర్యానీలు లాగించేస్తుంటారు. దీంతో అతనికి తరచూ కడుపునొప్పితో పాటు, విరోచనంలో రక్తం పడటంతో అనుమానం వచ్చి వైద్యుడిని సంప్రదించారు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారించారు.

జీర్ణకోశ వ్యాధులతో పాటు, క్యాన్సర్‌కు దారితీస్తున్న వైనం గుండెపోటు, మెదడుపోటు కూడా... ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న వైద్యులు

కొంపముంచుతున్న కల్తీ

లబ్బీపేట(విజయవాడతూర్పు): కల్తీ ఆహారం... ప్రజలను అనారోగ్యం పాల్జేస్తోంది. నగరంలోని హోటల్స్‌ నుంచి రెస్టారెంట్‌ల దాకా, కార్పొరేట్‌ స్వీట్స్‌ షాపుల నుంచి రోడ్డు పక్కన అమ్మే పానీ పూరి బళ్ల వరకూ అన్నీ కల్తీ జరుగుతున్నాయి. వాడిన నూనెనే ఐదారుసార్లు వాడటం, రంగు, రుచికోసం రసాయనాల వినియోగం వంటి వాటితో ప్రజలను అనారోగ్యం పాల్జేస్తున్నాయి. సమయపాలన లేని ఆహార అలవాట్లు కొంపముంచుతున్నాయి.

అప్రమత్తం కాకుంటే పెనుముప్పే
అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా రెస్టారెంట్‌లు, ఫుడ్‌కోర్టుల్లో బిర్యానీలు లాగించేస్తుండటంతో తొలుత జీర్ణాశయ వ్యాధులు, అనంతరం ప్రాణాపాయ స్థితికి దారితీస్తున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న, లివర్‌ సిర్రోసిస్‌, పాంక్రియాటైటీస్‌, క్యాన్సర్‌ కేసులు చూస్తుంటే ఆందోళన కలిగిస్తున్నాయి. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్‌ క్యాన్సర్‌ సోకుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రిల్లో ఈ రకం వ్యాధులే ఎక్కువగా వస్తున్నాయి. అన్నవాహిక క్యాన్సర్‌లు కూడా నమోదవుతున్నాయి. ఇప్పటికై నా అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెనుముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు.

ఇవే నిదర్శనం
వీరద్దరే కాదు.. ఇటీవల వైద్యులను సంప్రదిస్తున్న వారిలో పెద్దపేగు, జీర్ణాశయ, లివర్‌ వ్యాధులు ఎక్కువగా వస్తున్నట్లు చెపుతున్నారు. అందుకు కల్తీ ఆహారమే కారణంగా పేర్కొంటున్నారు.

జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్న వైనం
ఆహార నియమాలు పాటించక పోవడంతో ఒబెసిటీకి దారితీసి క్రమేణా జీవనశైలి వ్యాధులకు దారి తీస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. అలాంటి వారిలో మధుమేహం, రక్తపోటుతో పాటు, హైపో థైరాయిడ్‌ వంటి వ్యాధులు సోకుతున్నట్లు చెబుతున్నారు. ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటించడంతో పాటు, రెగ్యులర్‌గా వ్యాయామం చేయడం ఎంతో ముఖ్యమంటున్నారు. ఈ విషయంలో అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో వ్యాధుల ముప్పు పొంచి ఉన్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నాన్‌వెజ్‌ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులు ఎక్కువగా వాడుతుంటారు. మృతజంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలు వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అందుకు ఫుడ్‌ కంట్రోల్‌ శాఖ వారు నిర్వహించిన తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి. మాంసాన్ని నిల్వ ఉంచి వంటలు చేయడం, వాడిన నూనెనే మళ్లీ, మళ్లీ వడపోసి వాడటం వంటివి చేస్తున్నట్లు చెపుతున్నారు. బయట ఆహారం తినడం తగ్గించడం ఎంతో ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్‌లకు కల్తీ ఆహారమే ప్రధాన కారణం అంటున్నారు.

ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే 1
1/1

ఆహారం కల్తీ.. ఆరోగ్యం అంతే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement