
అన్నదాతకు తప్పని ఎదురుచూపులు
నాడు వర్షాలు....సాగునీటి కోసం... నేడు యూరియా కోసం పీఏసీఎస్‌లలో రుణాలు తీసుకున్న వారికే ప్రాధాన్యం ఖరీఫ్‌కు 38,300 మెట్రిక్ టన్నులు అవసరమని నివేదికలు ఇచ్చింది..20,359 మెట్రిక్ టన్నులు ప్రస్తుతం జిల్లాలో 2,85,110 ఎకరాల్లో వరిసాగు
పెడన: అన్నదాతకు ఎదురు చూపులు తప్పడం లేదు. నిన్న..మొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసి చూసి విసుగు చెందాడు. అయితే అతివృష్టి లేదా అనావృష్టి అన్నట్టుంది వాతావరణ పరిస్థితి. ఖరీఫ్ సాగు ఆలస్యంగా ప్రారంభించారు. వర్షాలు పడి..నీరు అందుతుందనే సమయంలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. సాగునీరు పుష్కలంగా వస్తున్నాయని వాటి కోసం ఎదురుచూసిన రైతుకు అవి కూడా అరకొరగానే రావడంతో వాటి కోసం ఎదురుచూసి మోటార్లు పెట్టుకుని తోడుకుని కష్టపడాల్సివచ్చింది. పంటను కాపాడుకునేందుకు యూరియా సరైన సమయంలో కొట్టడానికి ఉద్యుక్తులవుతుండగా యూరియా దొరకని పరిస్థితి. రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకు యూరియా అందిస్తే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి పేరొస్తుందేమోనని భావించి పీఏసీఎస్‌ల ద్వారా రైతులకు యూరియా అందిస్తున్నారు. అక్కడ రుణాలు తీసుకున్న వారికే యూరియా కట్టలు అంటూ మెలిక పెడుతున్నారు. పీఏసీఎస్‌లకు చెందిన పాలకులు, సభ్యులు తమకు అనుకూలమైన వారికి ఇస్తూ మిగిలిన వారికి చుక్కలు చూపిస్తున్నారు.
జిల్లా వ్యాప్తంగా 38,300 మెట్రిక్ టన్నులు అవసరం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌కు జిల్లా వ్యాప్తంగా 38,300 మెట్రిక్ టన్నులు యూరియా అవసరమని గుర్తించి అధికారులు ప్రభుత్వానికి నివేదికలు పంపించారు. ఇప్పటివరకు 20,359 మెట్రిక్ టన్నులు విక్రయించగా 2,756 టన్నులు బ్యాలెన్సు ఉంది. ఇంకా 4,065 మెట్రిక్ టన్నులు రావాల్సి ఉందని అధికారిక గణాంకాలు. వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా 2,85,110 ఎకరాల్లో వరి సాగు అవుతోంది. ఈ విస్తీర్ణానికి ఎకరానికి మూడు కట్టలు చొప్పున అంటే 150 కేజీల చొప్పున 42,776 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అధికారులు ఎకరానికి మొదటి డోసు అరకట్ట, రెండో డోసు కట్ట, మూడో డోసు కట్ట చాలని చెబుతున్నారు. రైతులు మాత్రం ఎకరానికి మూడు కట్టలు కావాల్సిందేనంటున్నారు.
మార్కెట్‌లో గుళికలతో లింకు
బయట మార్కెట్‌లో రూ.270 పెట్టి యూరియా కొంటే రూ.600 పెట్టి గుళికలు కొనుగోలు చేయాల్సి వస్తుండటంతో రైతులు పీఏసీఎస్‌లను ఆశ్రయిస్తున్నారు. యూరియా కోసం అధిక సంఖ్యలో రైతులు పీఏసీఎస్‌లకు వస్తుండటంతో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేసుకుంటున్నారు. యూరియా లోడు వస్తే ముందుగా పీఏసీఎస్‌లలో రుణాలున్న వారికి టోకెన్లు ఇచ్చి పంపిస్తున్నారు. ఆ తరువాత యూరియా ఉంటే మిగిలిన రైతులకు ఇచ్చే పరిస్థితి నెలకొంది.