
వాహనమిత్ర పథకంలో రూ. 25వేలు ఇవ్వాలి
మధురానగర్(విజయవాడసెంట్రల్): మహిళలకు అందుబాటులోకి తెచ్చిన ఉచిత బస్సుతో నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ప్రభుత్వం ఆదు కోవాలని.. వారికి వాహన మిత్ర ద్వారా రూ. 25 వేలు ఇవ్వాలని ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.శివాజీ, ముజఫర్ అహ్మద్ డిమాండ్ చేశారు. సంఘ నేతలు శనివారం బీఆర్టీఎస్ రోడ్డులోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సీ్త్ర శక్తి పథకంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారన్నారు. కరోనా అనంతరం ఆర్థికంగా దెబ్బతిన్న ఆటోడ్రైవర్ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదన్నారు. ఉపాధి అవకాశాలు లేక ఒకరిపై ఆధారపడకుండా సొంత పెట్టుబడి, ఫైనాన్స్‌లతో స్వయం ఉపాధిగా ఆటోడ్రైవర్లు జీవనం సాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 115 పట్టణాల్లో విదేశీ సంస్థలు ర్యాపిడో, ఊబర్, ఓలా కంపెనీలకు అనుమతులు ఇచ్చారన్నారు. దీంతో ఆటోడ్రైవర్లు కిరాయిలు లేక అవస్థ పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. ఆర్థికంగా నష్టపోతున్న ఆటోడ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని చెప్పారు. అధికారంలోకి రాక ముందు ఆటోడ్రైవర్లను ఆదుకుంటామంటూ అనేక హామీలు ఇచ్చిన కూటమి నేతలు వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు పథకం ప్రారంభించడానికి ముందు ఆటోడ్రైవర్ల సంఘాలతో చర్చించకపోవడం ప్రభుత్వ బాధ్యతారాహిత్యాన్ని తెలియజేస్తోందన్నారు. ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలంటూ ఈనెల 18,19 తేదీల్లో ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రం ఇస్తామన్నారు. దీనిపై సీఎం స్పందించకపోతే ఈనెల 24న ఒంగోలులో జరిగే రాష్ట్ర మహాసభలో ఆందోళన కార్యక్రమానికి కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర కోశాధికారి కె.దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.