
నదీ తీరం.. అక్రమార్కుల పరం!
దర్జాగా ఇరిగేషన్ స్థలాల కబ్జా.. శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న నిబంధనలు గాలికి చోద్యం చూస్తున్న ఇరిగేషన్, టౌన్‌ప్లానింగ్ అధికారులు
భవానీపురం(విజయవాడపశ్చిమ): కృష్ణానదీ తీర ప్రాంతం అక్రమార్కుల పరమవుతోంది. నదీ తీరాన శాశ్వత కట్టడాలు నిర్మించకూడదన్న జలవనరుల శాఖ(ఇరిగేషన్) నిబంధనలు గాలికి వది లేసింది. దర్జాగా ఇరిగేషన్ స్థలాలను కబ్జా చేసి శాశ్వత నిర్మాణాలు జరిగినా అటు ఇరిగేషన్, ఇటు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారు. వరదలు వస్తే నదీ తీర ప్రాంతం కచ్చితంగా మునిగిపోతుందని తెలిసినా అప్పుడు చూసుకుందాంలే అన్నధీమాతో ఉన్నారు. టీడీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు నదీ తీరాన షెడ్లు నిర్మించి అద్దెకు ఇచ్చేస్తున్నారు. మరోవైపు ఒక వ్యక్తి గుడి మాటున పక్కా కట్టడాలు నిర్మిస్తున్నాడు. ప్రతిరోజూ ఈ రెండు ప్రాంతాల్లో రాకపోకలు సాగిస్తున్న అధికారులు ఆ నిర్మాణాలను చూసి పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణదారుల నుంచి భారీగానే ముడుపులు దండుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గుడి పేరుతో ఆక్రమణ!
విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన భవానీపురం 40వ డివిజన్ పరిధిలోని పున్నమిఘాట్‌కు ఇవతల కరకట్ట సౌత్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఇరిగేషన్ స్థలాన్ని ఒక వ్యక్తి ఆక్రమించుకున్నాడు. గుడి పేరుతో అయితే ఎవరూ పట్టించుకోరన్న ఉద్దేశమో లేదా ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరన్న భావనతోనో ఏకంగా పెద్ద స్థలాన్నే కబ్జా చేశాడు. ఇతను ఏ సామాన్యుడో కాదు.. ఒకప్పుడు ప్రజాప్రతినిధిగా వెలగబెట్టిన వ్యక్తి కావడం గమనార్హం. తొలుత షెడ్లు నిర్మించి ఇప్పుడు వాటిని తొలగించి శాశ్వత కట్టడాలు నిర్మించి శ్లాబు కూడా వేశాడు. ఈ అక్రమ నిర్మాణాల వైపు ఎవరూ కన్నెత్తి చూడకుండా అధికారంలో ఉన్న ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటాడు. ప్రస్తుత పచ్చ ప్రభుత్వంలో గుడి మొత్తం పసుపు రంగులు వేసేశాడు. రోజూ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఇటు వైపు రాకపోకలు సాగిస్తూనే ఉంటారు. అయినా పసుపు రంగు వేసి ఉండటంతో అధికార పార్టీకి చెందిన వ్యక్తి అయి ఉంటాడని భావించి మరోవైపు చూస్తూ వెళ్లిపోతారని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.
అధికారుల చర్యలు శూన్యం
భవానీపురం పున్నమిహోటల్‌కు ఆనుకుని విద్యాధరపురం హిందూ శ్మశానవాటికకు దక్షిణం వైపు గత కృష్ణా పుష్కరాల సమయంలో తొలగించిన చిన్న చిన్న గుడిసెల స్థానంలో ఇప్పుడు షెడ్లు దర్శనమిస్తున్నాయి. వాటికి మున్సిపల్ కార్పొరేషన్‌లో అసెస్‌మెంట్ నంబర్ గానీ, పన్నులు గానీ, అనధికార నిర్మాణాల్లో వ్యాపారాలు చేస్తున్న వారెవరికీ ట్రేడ్ లైసెన్స్‌లు గానీ లేవు. అదేమని అడిగితే ఈ స్థలం తమదేనంటూ బుకాయిస్తున్నారు. వాస్తవానికి నదీ తీరాన అక్రమ కట్టడాలపై జలవనరుల శాఖ ఉప కార్యనిర్వాహక ఇంజినీర్‌కు 2023 డిసెంబర్ 27న కలెక్టర్ లేఖ రాశారు. ఫలితం లేకపోవడంతో గత ఏడాది జనవరి 17న ఇరిగేషన్ శాఖ కార్యనిర్వాహక ఇంజినీర్ (కృష్ణా మధ్య విభాగం) పీవీఆర్ కృష్ణారావుకు జిల్లా కలెక్టర్ మరో లేఖ రాశారు. అయినా సంబంధిత అధికారులు కబ్జా వ్యవ హారంపై ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

నదీ తీరం.. అక్రమార్కుల పరం!