
కొండలమ్మ ఆదాయానికి గండి
వసూలు కాని రూ.40 లక్షల బకాయిలు చోద్యం చూస్తున్న దేవదాయ శాఖ అధికారులు అమ్మవారి సన్నిధిలో కులాల జాడ్యం అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని తెలుగు తమ్ముళ్ల ఆరోపణ
గుడ్లవల్లేరు: కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది గడిచినా శ్రీ కొండలమ్మ ఆలయానికి ధర్మకర్తల మండలిని ఏర్పాటు చేయకపోవటంతో జవాబు దారీతనం లేకుండా పోయింది. జిల్లాలో అత్యధికంగా కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే శక్తి ఆలయాల్లో వేమవరం శ్రీ కొండలమ్మ అమ్మవారి దేవస్థానానికి ఎంతో ఖ్యాతి ఉంది. ఆ ఆదాయానికి కొందరు స్వార్థశక్తులు 2008–09వ సంవత్సరం నుంచి గండి కొడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయానికి వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకుని అమ్మవారికి రావలసిన బకాయిలను వసూలు చేయకుండా ఏళ్ల తరబడి దేవదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. అమ్మవారి సన్నిధిలో భక్తులు చెల్లించే మొక్కుబడుల్లో భాగంగా కొబ్బరి చిప్పలు, చీరలు, ధాన్యం సేకరణ చేసే హక్కులను పొందేందుకు కొందరు అధికారులు తమకు అనుకూలంగా ఉండే పాటదారులకే కట్టబెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులను ప్రసన్నం చేసుకుంటే చాలు అమ్మవారి సన్నిధిలో పాటదారులకు ఆడిందే ఆటగా...పాడిందే పాటగా ఉంది. ఏళ్ల తరబడి రూ.40 లక్షల బకాయిలను ఐదారుగురు పాటదారులు చెల్లించవలసి ఉన్నా ఆ విషయం అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు.
కొండలమ్మకు చెల్లించకపోతే ఆస్తుల జప్తే...
అమ్మవారికి ఒకవేళ చెల్లించవలసిన సొమ్మును బకాయి పడిన సంబంధిత పాటదారులు చెల్లించకపోతే దేవదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం కోర్టు ద్వారా వచ్చే ఆర్డరుతో పాటదారుల ఆస్తుల్ని కూడా జప్తు చేసే హక్కు అధికారులకు ఉంది. కాని ఆ నిబంధనలను వర్తింపజేయకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారు. గతంలో ఒక ఆలయ ఈఓ రూ.40 లక్షల బకాయిల గూర్చి బకాయిదారులపై కోర్టులో కేసు వేశారు. కాని దానిని ముందుకు వెళ్లనివ్వకుండా కొన్ని దుష్ట శక్తులు తొక్కి పెడుతున్నాయి. రూ.40లక్షల బకాయిలు చెల్లించవలసిన ప్రతి ఒక్క బకాయిదారుడు ఆర్థికంగా చెల్లించే శక్తి ఉన్నవారే. కాని ఒకరు బకాయి చెల్లించలేదని మరొకరు తాత్సారం చేస్తూ అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు.
దేవస్థాన పాలనా వ్యవహారాల్లోకి కుల జాడ్యం
అమ్మవారి ఆలయ పాలనా వ్యవహారాలకు కుల జాడ్యం పట్టింది. దాదాపుగా తెలుగు తమ్ముళ్లే ఆలయ పరిపాలనా వ్యవహారాల్లో ఉన్నా కులపరంగా కూడా ఆలయంలో పరిపాలన నడుస్తోందన్న ఆరోపణలు స్థానిక భక్తుల నుంచి వస్తున్నాయి. అధికారులు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారని టీడీపీలోనే కొందరు తెలుగు తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. అధికారులు అక్రమార్కులకు కొమ్ము కాయటంతో దేవస్థానం ఆదాయానికి గండి పడుతోందని వారు ఆరోపిస్తున్నారు. పాటదారులు కొబ్బరి చిప్పలు, చీరలు, ధాన్యం సేకరణ చేసే హక్కులను పొందేందుకు బహిరంగ వేలంలో పాడుకుంటారు. బహిరంగ వేలం పెట్టే తరుణంలో ఎవరైనా పాటదారులు బయట నుంచి వస్తే వారిని తిట్టి, కొట్టి తరిమేయటం వంటి బెదిరింపులు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. బయట నుంచి వచ్చిన పాటదారులను పంపించేసినా... వేలం తక్కువ ధరకు రాని పక్షంలో ఆ వేలం ఎన్నిసార్లు పెట్టినా...అన్నిసార్లు వాయిదా వేయిస్తున్నారు. ఒకవేళ పాడుకున్నా...హక్కు పొందే కాల వ్యవధిలో సగం రోజుల పాటే ఆ ఆ సేకరణ బాధ్యతను నిర్వహిస్తున్నారు. తమకు పాడుకున్న పాటలో నష్టం వచ్చిందని సొమ్ము చెల్లించకుండా ఎగవేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. మళ్లీ అదే హక్కు కోసం జరిగే వేలంలో తమ బినామీల పేరిట పాత పాటదారులే పాడతారు. ఆ బకాయిదారులే అమ్మవారి సన్నిధిలో సేకరణ చేయటం స్థానిక భక్తులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ ధాన్యం, చీరలు, కొబ్బరి చిప్పల సేకరణ హక్కుల విషయంలోనే గాక అమ్మవారి దుకాణ సముదాయాల విషయంలో కూడా ఇవే పరిస్థితులు తలెత్తటంతో అవి ఏళ్ల తరబడి మూతపడుతూనే ఉన్నాయి.

కొండలమ్మ ఆదాయానికి గండి