
వరద తగ్గు ముఖం
మద్దూరు ఏటిపాయ అంచులు తాకుతూ నీటి ప్రవాహం లంక పొలాల్లో పనులకు పడవల్లో వెళ్తున్న రైతులు, కూలీలు మొక్కుబడిగా సాగుతున్న అధికారుల పర్యవేక్షణ
కంకిపాడు: మద్దూరు ఏటిపాయలో వరదనీటి ప్రవాహం తగ్గు ముఖం పట్టింది. ఎగువనుంచి వరదనీటి విడుదల తగ్గింది. ఏటిపాయ క్రమేపీ వెనక్కి వెళ్తోంది. ప్రస్తుతం పాయ అంచులు తాకుతూ నీటి ప్రవాహం ఉంది. అధికారుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ కూలీలు, రైతులు పడవల సాయంతో పొలాల్లో పనులకు వెళ్తున్నారు. బందోబస్తు పర్యవేక్షణ అంతా మొక్కుబడిగా సాగుతుందనడానికి ఇదొక ఉదాహరణ. ప్రకాశం బ్యారేజీ నుంచి రెండు రోజుల క్రితం 5.65 లక్షల క్యూసెక్కుల వరదనీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారు. దీంతో పెనమలూరు నియోజకవర్గంలోని పెనమలూరు, కంకిపాడు మండలాల గుండా ఏటిపాయ ఉద్ధృతంగా ప్రవహించింది. ఏటిపాయ అంచుల నుంచి కరకట్ట వైపు చొచ్చుకువచ్చింది. కరకట్టకు దిగువన సాగు చేసిన పొలాలు, ఏటిపాయ మధ్యన ఉన్న లంక భూములో పొలాలు మునిగిపోతాయని రైతులు ఆందోళన చెందారు. వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో ముంపు భయం వీడింది.
నిండుగా నీటిప్రవాహం
వరద తగ్గినా నీటి ప్రవాహం మాత్రం యథావిధిగా కొనసాగుతోంది. ప్రస్తుతం పాయ అంచులు తాకుతూ వరద ప్రవహిస్తోంది. ఏటిపాయ మాత్రం ఎగువ నుంచి వచ్చి చేరుతున్న నీటితో ఉరకలు వేస్తోంది. మద్దూరు వద్ద ఏటిపాయ మధ్యన ఉన్న రోడ్డు మార్గం ఇంకా వరదనీటిలో మునిగే ఉంది. కాసరనేనివారిపాలెం వద్ద శివాలయం పరిసరాల్లో వరదనీటి ముంపు నుంచి కోలుకుంటోంది.
అధికారుల ఆదేశాలు బేఖాతర్
ఉద్ధృతి సమయంలో అధికారుల ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయి. వరదనీటి ప్రవాహం అధికంగా ఉండటంతో ఏటిపాయలోకి ఏ ఒక్కరూ వెళ్లవద్దని హెచ్చరిక చేస్తూ అధికారులు బ్యానర్లు ఏర్పాటుచేశారు. అయితే కొందరు రైతులు, కూలీలు మాత్రం పడవల సాయంతో పాయ మధ్యన ఉన్న లంక భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్తున్నారు.

వరద తగ్గు ముఖం