
ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు
భవానీపురం(విజయవాడపశ్చిమ): శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపైగల శ్రీదుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ప్రధాన ఆలయ మండపంలో నిర్వహించిన ఈ పూజల్లో దేవస్థానం కార్యనిర్వహణాధికారి వీకే శీనా నాయక్ దంపతులు పాల్గొన్నారు. తొలుత గోమాతకు ఘనంగా పూజలు చేసిన అనంతరం శ్రీకృష్ణ భగవాన్‌కు పూజలు నిర్వహించారు. ఈ వేడుకల నిమిత్తం దేవస్థానం స్థానాచార్యులు, వైదిక కమిటీ, అర్చక బృందం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా విశేష సౌకర్యాలు కల్పించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం అనంతరం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల నుంచి దేవస్థాన పురాణ పండితులు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి ఉపన్యసించారు. అనంతరం మల్లికార్జున మహామండపం 7వ అంతస్తులో రాజగోపురం ముందు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
నెమలిలో కృష్ణాష్టమి వేడుకలు
తిరువూరు: గంపలగూడెం మండలం నెమలి శ్రీవేణుగోపాలస్వామి దేవస్థానంలో శనివారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామివారిని నవనీత కృష్ణుడిగా విశేష అలంకరణ చేసి తొమ్మిది రకాల ప్రసాదాలు నివేదించారు. పెద్ద సంఖ్యలో భక్తులు వేణుగోపాలుడిని దర్శించుకున్నారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సంధ్య పర్యవేక్షణలో అర్చకులు వేడుకలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఆలయంలో ఉట్టికొట్టే మహోత్సవాన్ని నిర్వహించారు.

ఇంద్రకీలాద్రిపై శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు